తన హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాల్లో ఇరుక్కుంటామని చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతున్నట్లే ఉంది. అందుకే విద్యుత్ పిపిఏలపై సమీక్షలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మీడియా సమావేశం పెట్టి విద్యుత్ కొనుగోళ్ళు, పిపిఏలపై సమీక్షలు అవసరం లేదని చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

తన హయాంలో చేసిన విద్యుత్ కొనుగోళ్ళలో అవినీతి జరగకపోతే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు. జగన్ ప్రభుత్వమైనా ఇంకో ప్రభుత్వమైనా సమీక్షలు చేస్తే చేయనీయొచ్చు కదా ? తాను జరిపిన కొనుగోళ్ళంతా పాదర్శకంగానే జరిపానని, నియమ, నిబంధనల ప్రకారామే జరిగాయంటున్నపుడు ప్రభుత్వ సమీక్షను చాలెంజ్ చేయొచ్చు.

 

ఒకవైపేమో అప్పట్లో చంద్రబాబు కొనుగోలు చేసిన విండ్, సోలార్ పవర్ పై అప్పటి ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్  తదితరులు అభ్యంతరాలు పెట్టినట్లు జగన్ మీడియా స్పష్టంగా ఫైల్ నెంబర్లతో సహా వివరిస్తోంది. అవన్నీ అబద్ధాలంటూ చంద్రబాబు బుకాయిస్తుండటమే విచిత్రంగా ఉంది. పైగా అధికారులు జగన్ కు తప్పుడు సమారాలు ఇస్తున్నట్లు ఎదురు దాడి చేస్తున్నారు.

 

విద్యుత్ కొనుగోళ్ళపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటి దాదాపు రూ. 3 వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రాధమికంగా గుర్తించినట్లు ప్రభుత్వ సలహాదారు అజేయ్ కల్లం చెప్పారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నా ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబు అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసినట్లు ప్రాధమిక ఆధారాలున్నట్లు సమాచారం. మరి అన్నీ బయటపడిన తర్వాత చంద్రబాబు ఏమంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: