పోడు భూముల నుండి పొమ్మంటారా ?
అటవీ హక్కులు సమగ్రంగా గుర్తించకుండానే అటవీ భూములలో 'హరిత హారం' పేరుతో మొక్కల పెంపకం చేపట్టడంతో తరచూ తెలంగాణలో ఆదివాసీలకు, అటవీ శాఖాధికార్లకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే అటవీ అధికారులకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ రూపొందించిన ముసాయిదా చట్టం ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. కార్పొరేట్‌ రంగానికి, కలప ఆధారిత పరిశ్రమలకు కలప సమకూర్చేవిధంగా 'ఉత్పాదక అడవుల' పేరుతో కొత్త విధానం వచింది.

'తెలంగాణ అటవీ చట్టం- 2019 ముసాయిదాలో పేర్కొన్న పలు అంశాలు ఆదివాసీల జీవనోపాధిని దెబ్బతిసేవిగా ఉన్నాయి. కనుక రాజ్యాంగం ఐదవ షెడ్యూలు కింద పేర్కొన్న గిరిజన సలహా మండలి సిఫార్సుల కోసం ఈ ముసాయిదాను పంపించాలి. ఆదివాసీల అటవీ హక్కులు హరించే విధంగా ప్రస్తుత 'అటవీ చట్టం -1967' స్థానంలో 'తెలంగాణ అటవీ చట్టం- 2019' ముసాయిదాను కేసీఆర్‌ ప్రభుత్వం రూపొందించింది. అన్యాయానికి గురయిన ఆదివాసీల అటవీ హక్కుల గుర్తింపునకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వపు 'అటవీ హక్కుల చట్టం- 2006', అలాగే 'షెడ్యూల్డు ప్రాంత పంచాయితీరాజ్‌ విస్తరణ (పెసా) చట్టం- 1996'కు ప్రభుత్వ ముసాయిదా పూర్తిగా విరుద్ధం. పోడు భూముల నుంచి ఆదివాసీలను పొమ్మనకుండా పొగపెట్టే విధంగా కఠిన నియమాలతో ఈ ముసాయిదా ఉండటం గర్హనీయం.' అంటున్నారు, ఆదివాసీ హక్కుల కార్యకర్త డా. పల్లా త్రినాథరావు.

ఆదివాసీల, ప్రజాస్వామిక సంఘాలతో చర్చించిన తర్వాతనే తెలంగాణ అటవీ చట్టం- 2019 ముసాయిదాను ప్రభుత్వం ఆమోదించాలి. ముసాయిదా చట్టాన్ని యథావిధిగా శాసనంగా తీసుకువచ్చినట్లయితే ఆదివాసీలను ఆందోళనకు గురిచేసి వారి అటవీ హక్కులను హరించినట్లవుతుంది అని ఆదివాసీల హక్కుల కోసం పనిచేస్తున్న కార్యకర్తలు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: