'ఉద్దానం'లోని ఏడు మండలాల్లో గత ఏడాది 650 పైగా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీకి నోచుకోలేదు. బదిలీల నేపథ్యంతో  పాటు విభిన్న కారణాలతో ఉద్దానం మండలాల్లోని ఎన్నో  పాఠాశాలలు మూతపడే పరిస్థితి ఎదురయింది. 120 వరకు పాఠశాలలకు తాళం వేసే పరిస్థితి రాగా...350 పాఠశాలల్లో ఒకరిద్దరు ఉపాధ్యాయులే ఎనిమిది తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి పట్టింది. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి ప్రభుత్వానికి సమస్య వివరించారు. ఉద్దానం మండలాల్లోనే ప్రత్యేకంగా 525 మంది అకాడమిక్ ఉపాధ్యాయుల నియామకానికి అనుమతులు తెచ్చారు. రిజర్వేషన్లు, ఇతర నిబంధనలు అమలు చేస్తూ శిక్షణ పొందిన అభ్యర్థులను నియమించారు.

ప్రాధమిక , ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే వారికి నెలకు రూ.5 వేలు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసేవారికి రూ.7 వేలు గౌరవేతనం చెల్లించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018 సెప్టెంబర్ నుంచి 2019 ఏప్రెల్ వరకు వారు పని చేసారు. ఆర్ధిక శాఖ అనుమతితో నియమించిన వీరికి ఇప్పటివరకు వేతనాలు చెల్లించకపోవడం పై తీవ్ర  ఆవేదన వ్యక్తం అవుతోంది. ముగ్గురు కలెక్టర్ల తో  పాటు ముగ్గురు జిల్లా విద్యాశాఖాధికారులు మారినా ఉద్దానం చదువులకు ఊతమిచ్చిన వారి శ్రమకు తగ్గ ఫలితం మాత్రం దక్కలేదు.

తుఫాన్ల సమయాల్లోనూ కొందరు అకాడమిక్ ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో సేవలను అందించారు. వీరంతా ఎనిమిది నెలల పాటు ఉపాధ్యాయ బాధ్యతలను నిర్వహించారు. ముఖ్యంగా తిత్లీ తుఫాన్ లో ప్రత్యేక సేవలు అందించారు. నెలవారీగా వేతనాలు చెల్లించాయాల్సినప్పటికీ తిత్లీ , ఫోని తుఫాన్ ల ప్రభావం , ఆ తరువాత ఎన్నికల  వ్యవహారాలు వీరి వేతనాల చెల్లింపులకు ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది. కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాశాఖాధికారి నిరంతరం వినతులు అందజేస్తున్నా అదిగో..ఇదిగో అంటున్నారే తప్పా వేతనాలు మాత్రం చెల్లించడంలేదని ఉంపాద్యాయులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: