కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడిగా ముద్ర‌ప‌డ్డ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజ‌కీయం ఏంటో అర్థం కాక కాంగ్రెస్ నేత‌లు ఓ రేంజ్‌లో గంద‌ర‌గోళ ప‌డుతున్నారు. ఓ వైపు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటే త‌న‌కు ప‌డ‌ద‌ని చెప్తూనే...మ‌రోవైపు ఆయ‌న్ను బాద‌పెట్టే ప‌నుల‌కు రాజ‌గోపాల్‌రెడ్డి దూరంగా ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. తాజాగా, అసెంబ్లీలో ఆయ‌న తీరు ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ నేత‌లంతా ఆందోళ‌న తెలుపుతుంటూ...రాజ‌గోపాల్‌రెడ్డి కిమ్మ‌న‌కుండా ఉండిపోయారు.


ఫిరాయింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శాసన సభ్యులు ఇవాళ అసెంబ్లీలో నిరసన ప్రదర్శన చేశారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సింగ్ తో.. నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. సీఎల్పీ విలీనంపై నిరసన తెలిపారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార పార్టీవైపు సీట్లు కేటాయించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర‌సిస్తూ అసెంబ్లీలో నినాదాలు చేశారు. అనంత‌రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.  అయితే.. భట్టి విక్రమార్క సహా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతుండగా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీ నుంచి బయటకొచ్చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నిరసనకు మద్దతివ్వలేదు. ఆయన కూడా సైలెంట్ గా ఉండిపోయారు.


స‌భ‌లోనే ఇలా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మ‌రింత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ఆహ్వానం పలుకుతున్నా తానే వెళ్లటం లేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం తప్పులు చేస్తుందనే బాధతోనే అలాంటి మాటలు మాట్లాడానన్నారు. క్రాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానికి తాను సిద్దంగా ఉన్నానన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల లోపం వల్లే ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయం అవుతుందన్న ఆయన.. తాను యూటర్న్ తీసుకున్నానని తప్పుగా మాట్లాడుతున్నారని.. ప్రస్తుతం తను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని గుర్తు చేశారు. అలాంటి సమయంలో తాను యూటర్న్ ఎలా తీసుకుంటానని ప్రశ్నించారు. అయితే, సందర్భం వచ్చినప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారన్న కోమటిరెడ్డి.. దానికి నేను రిప్లై కూడా ఇచ్చాను.. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తాను చాలా కష్టపడిన వ్యక్తిని.. కాకపోతే పార్టీ నేతలు నిర్ణయాలు సరైనవి తీసుకోకపోవడంతో నష్టం జరిగిందని వివరణ ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయితే, ఆ తర్వాత మళ్లీ నాకు రిప్లే రాలేదు.. క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోలేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు తాను తప్పకుండా నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. రాష్ట్రంలో సీఎల్పీ లేదు.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాత్రమే ఉన్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: