ఉత్తమ తహశీల్దార్ గా అవార్డు అందుకుని.. అదే చేత్తో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక అక్రమ సంపాదనతో దొరికిపోయిన కేశంపేట తహశీల్దార్ లావణ్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఏసీబీ తనిఖీల్లో ఏకంగా రూ. 93 లక్షల నగదు దొరికిన కేశంపేట తహశీల్దార్ లావణ్య అవినీతి ఉదంతంలో మరిన్ని కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె అక్రమ సంపాదన వెలికి తీస్తున్న కొద్దీ బయటపడుతోంది.


తవ్వినకొద్దీ ఆమె అక్రమ సంపాదనకు సంబంధించిన ఖాతాలు బయటపడుతున్నాయి. తాజాగా ఆమె బంధువుకు సంబంధించిన ఖాతాలో సుమారు రూ.20 లక్షలు, మరో బంధువు ఖాతాలో రూ. 10లక్షల నగదు ఏసీబీ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీంతో పట్టుబడిన ఆమె ఆస్తుల విలువ రూ. కోటి 20 లక్షలు దాటింది.


ఇంకా ఆమె స్నేహితులు, బంధువులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల పరిశీలన కొనసాగుతోంది. ఈ మొత్తం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేసరికి అక్రమ సంపాదన కేవలం నగదు రూపంలోనే రెండు కోట్లు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇవి కాకుండా ఇంకా స్థిర, చరాస్తుల రూపంలో ఎంత సంపాదన పోగేసిందో తెలియాల్సిఉంది.


ఈ లావణ్య ఉదంతం రెవెన్యూ శాఖలో జరుగుతున్న దారుణమైన అవినీతి ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి లావణ్యలు ఇంకా రెవెన్యూ వ్యవస్థలో అడుగడుగునా తగులుతూనే ఉంటారు. మరి వీరికి ముకుతాడు వేసే ప్రయత్నం ఎప్పుడు జరుగుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: