మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, గ్రేటర్ హైద‌రాబాద్ న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడు ముఖేశ్‌గౌడ్ కొంత‌కాలంగా క‌నిపించ డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల‌తో పాటు త‌న అనుచ‌రుల‌కు కూడా ఆయ‌న దూరంగా ఉంటున్నారు. ఒక‌ప్పుడు గ్రేటర్ కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన ముఖేశ్‌గౌడ్‌... ఇటీవల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామ‌హాల్ నుంచి పోటీ చేసి ఓటమి పాల‌య్యారు. ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న క్రియాశీల రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించారు. పార్టీ కార్యక్రమాలకు దూర‌మైన్నా... ముఖ్య నేత‌లు పట్టించుకోవడంలేదు.  రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం ఆయన్ను మరిచిపోయిందా...? టీ పీసీసీ ముఖ్య నాయకులపై సదరు నేత కుటుంబ సభ్యులు ఎందుకు ఆవేదనగా ఉన్నారు...? 


పీజేఆర్ మరణాంతరం ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ ఇద్దరూ నగర కాంగ్రెస్‌ను లీడ్ చేశారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో అటు దానం నాగేందర్‌తో పాటు ముఖేష్ గౌడ్‌కు కాంగ్రెస్ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చింది. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత దానం నాగేందర్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ లో చేరిపోయారు. ముఖేష్ గౌడ్ మాత్రం ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్‌లోనే ఉన్నా ముఖేష్ గౌడ్ మాత్రం పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. స్వయంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నగరానికి వచ్చినా ఆయన మాత్రం ఆ సభలకు హాజరు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 


చాలా కాలంగా క‌నిపించ‌కుండా పోవ‌డంతో ముఖేష్‌గౌడ్ పార్టీ మారుతున్నార‌నే ప్రచారం జోరందుకుంది. ఆయ‌న బీజేపీలో చేర‌నున్నార‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే అవన్నీ ఫేక్ న్యూసేనని ఆయన వర్గీయులు కొట్టిపా రేస్తున్నారు. ఆయన సైలెంట్ కావడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు. ముఖేష్‌గౌడ్ ఏడు నెలలుగా నోటి కేన్సర్, కంటి కేన్సర్‌తో బాధపడుతున్నార‌ని, ఈకాలంలో ఆయ‌న క‌నీసం క‌ళ్లుకూడా తెర‌వ‌లేద‌ని అం న్నారు.హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతు న్న ముఖేష్ ప‌రిస్థితి ఇంకా విష‌మంగానే ఉంద‌ని చెబుతున్నారు.  ఇప్పటికే ఏడు సర్జరీలు చేసిన‌ప్ప‌టికీ, ఆరోగ్యం కుద‌ట‌ప‌డ‌క‌పోవ‌డంతో, మెరుగైన వైద్యం కోసం అమెరికా తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. 


అయితే వైద్యులు మాత్రం ముఖేష్ కోలుకోవ‌డానికి మ‌రి కొంత సమయం పడుతుందని చెబుతున్నారట. అలా కదల లేని స్థితిలో బెడ్ మీదున్న ఆయన పార్టీ మారుతున్నారంటూ ఫుకార్లు రావడంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. అయితే సీనియర్ లీడర్ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా, టీ పీపీసీ ముఖ్య నాయకులు మాత్రం కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు ఆ స్పత్రికి వెళ్లి ముఖేష్‌గౌడ్‌ను ప‌రామర్శించి,  కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి వచ్చారట. ఏడు నెల‌లుగా ఒక ముఖ్య నాయకుడు అనారోగ్యంతో బాధపడుతుంటే, పీసీసీ అధ్యక్షుడు గానీ సీఎల్పీ నేత గాని పలకరించిన దాఖ‌లాలు లేక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: