పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతుంది. వెంకయ్యనాయుడు-చంద్రబాబునాయుడు జోడి మంచి జోరుమీదున్నపుడు ఏపిలో బిజెపిని టిడిపి-2గా మార్చేస్తున్నారనే సెటైర్లు వినిపించేవి. కానీ మారుతున్న పరిస్ధితుల్లో, మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమి తర్వాత సెటైర్లు రివర్సులో వినబడుతున్నాయి.

 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణా టిడిపిలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజనకు మద్దతుగా చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయమే పార్టీకి శాపంగా మారిపోయింది.  కెసియార్ అధికారంలోకి వచ్చిన తర్వాత  తెలంగాణాలో టిడిపి తుడిచిపెట్టుకుపోయింది.  అందుకనే మొన్నటి ఎంపి ఎన్నికల్లో అసలు పోటీ కూడా చేయలేదు.


అదృష్టం కొద్దీ రాష్ర్ట విభజన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే నరేంద్రమోడితో చెడటం, ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేయటం అందరికీ తెలిసిందే. దాంతో చంద్రబాబుపై మోడి కత్తికట్టారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టిడిపి ఎంపిలను టార్గెట్ చేసి మరీ బిజెపిలోకి లాక్కుంటున్నారు. ఎంపిలే కాకుండా చాలామంది నేతలు బిజెపిలోకి వెళ్ళిపోతున్నారు. దాంతో తొందరలోనే చాలా జిల్లాల్లో టిడిపి ఖాళీ అయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది.

 

ఈ నేపధ్యంలోనే తొందరలో టిడిపి కాస్త బిజెపి-2 అయిపోతుందేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు టిడిపిలో ఉన్న నేతల్లో అత్యధికులు రేపటి ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవకాశం ఉంటే టిడిపి ఎంఎల్ఏల్లో అత్యధికులు బిజెపిలోకి ఫిరాయించేందుకు రెడీగా ఉన్నారు. అదే జరిగితే చాలా తొందరలోనే టిడిపి, బిజెపి-2 అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: