ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రపంచ బ్యాంక్‌ భారీ షాకిచ్చింది. అమరావతి రాజధాని ప్రాజెక్ట్‌ నుంచి ప్రపంచబ్యాంక్‌ తప్పుకుంటున్నట్టు గంట క్రితం  Down to Earth  పర్యావరణ వెబ్‌ సైట్‌లో షాకింగ్‌ న్యూస్‌ వచ్చింది. ఆ వార్తా కథనం ప్రకారం , రాజధాని నిర్మాణానికి, ప్రపంచ బ్యాంక్‌ రూ.2,100 కోట్ల రుణాన్ని నిలిపివేసింది.
గతంలో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంక్‌ అండదండలు అందించాలనుకుంది.
అయితే అమరావతి నిర్మాణంపై ప్రపంచ బ్యాంక్‌కు పర్యావరణ వేత్తలు,దళితులు, రైతుల పేరిట మెయిల్స్‌ వెళ్లాయి. ఈ మెయిల్స్‌ వెనుక వైసీపీ ఉందంటూ అప్పట్లో ప్రపంచబ్యాంక్‌కు టీడీపీ ఫిర్యాదు కూడా చేసింది. 
 అమరావతి సుస్థిర రాజధాని ప్రాజెక్టు కోసం,  300 మిలియన్‌ డాలర్ల రుణ సాయానికి గతంలో తెలుగు దేశం ప్రభుత్వం దరఖాస్తు చేయగా, ఇపుడు దాన్నుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

అమరావతి నగర నిర్మాణం తమ జీవనాధారానికి హాని చేస్తోందని, పర్యావరణానికి, ఆహారభద్రతకు ఇది భంగం కలిగిస్తోందని, అమరావతి నగర ప్రాంతంలో నివసిస్తున్న సామాజిక వేత్తలు కొందరు ప్రపంచబ్యాంకు తనిఖీ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు.  దీంతో ప్రపంచబ్యాంక్‌ రుణ విషయంలో కాలయాపన చేస్తూ వస్తోంది. చివరికి ప్రాజెక్ట్‌ నుంచి పక్కకు తప్పుకుంది. రైతులు, ప్రజా సంఘాల ఫిర్యాదుల నేపథ్యంలో ప్రపంచబ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది.
దీనిపై ప్రపంచబ్యాంక్‌ నుంచి అధికారిక సమాచారమేదీ లేదని సీఆర్‌డీఏ వర్గాలు అంటున్నాయి.

అలాగే ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ రుణాలపైనా కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధాని నిర్మాణానికి సుమారు రూ.1,400 కోట్లు ఇచ్చేందుకు గతంలో ఆసియా బ్యాంక్‌ ముందుకొచ్చింది. కానీ, ప్రపంచ బ్యాంక్‌ తీసుకున్న తాజా పరిణామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ ఉందని, 'డౌన్‌ టు ఎర్త్‌' పోర్టల్‌ అనుమానాలు వక్తం చేస్తుంది.

రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ వార్త హాట్‌ టాపిక్‌ అవుతుందని, దీనిపై ఇరు పక్షాలు నోట్స్‌ సిద్ధం చేసుకుంటున్నట్టు ఒక సమాచారం .



మరింత సమాచారం తెలుసుకోండి: