బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి షాక్ త‌గిలింది.  ఆదాయ పన్ను(ఐటీ) శాఖ నుంచి ఎదురుదెబ్బ తాకింది. ఆమె సోదరుడు ఆనంద్‌ కుమార్‌కు చెందిన నోయిడాలోని రూ. 400 కోట్ల విలువైన ఏడెకరాల భూమిని ఐటీ అధికారులు అటాచ్‌ చేశారు. ఆనంద్‌, ఆయన భార్య విచితర్‌ లతకు చెందిన ప్రాపర్టీని జప్తు చేసినట్టు ఐటీ శాఖ విశ్వసనీయవర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఈ ఏడెకరాల భూమి 'బినామీ' గా పరిగణించిన ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్‌నగర్ జిల్లా పరిధిలోని నోయిడాలో ఉన్న ఈ ఏడు ఎకరాల బినామీ ప్లాట్‌లో ఐదు నక్షత్రాల హోటల్‌ను నిర్మించాలని ఆనంద్ కుమార్ భావిస్తున్నారు. ఇటీవల ఆనంద్‌కుమార్‌ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మాయావతి నియమించారు. నియామకం జరిగిన కొద్దిరోజులకే బినామీ ప్లాట్ ఉదంతం తెరపైకి రావడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ ప్లాట్ ఆనంద్‌కుమార్, ఆయన భార్య లతదని ఐటీ అధికారులు గుర్తించారు. అయితే వీళ్లు ఈ ప్లాట్‌ను మరొకరి పేరున (బినామీ) రిజిస్టర్ చేయించారు. ఢిల్లీకి చెందిన హవాలా ఆపరేటర్ల ద్వారా భారీగా డబ్బులు మార్పిడి చేసి ఈ ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు ఐటీ శాఖ ఆరోపిస్తోంది. ఈ స్థిరాస్తిని ఐటీ శాఖ జప్తు చేసిన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేసే అవకాశముంది.


గతేడాది ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎస్కే జైన్‌ను సీబీఐ విచారించింది. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్ కోట్ల రూపాయల విలువైన బినామీ ఆస్తులను కొనుగోలు చేయడంలో జైన్ సహాయం చేసినట్లు సీబీఐ గుర్తించింది. బినామీ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి గరిష్టంగా ఏడేళ్ల‌ వరకు కఠినశిక్ష లేదా బినామీ ఆస్థి మార్కెట్‌ విలువలో 25శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: