అల్పేశ్ ఠాకూర్‌...గుజరాత్‌లో అధికార బీజేపీని ఎదిరించి కొద్దికాలం క్రితం సంచలనం సృష్టించిన యువనేత, ఇతర వెనుకబడిన వర్గాల ప్రతినిధి, కాంగ్రెస్ ఎమ్మెల్యే. గ‌త కొద్దికాలంగా కాంగ్రెస్ పార్టీ ప‌ట్ల అసంతృప్తితో ఉన్న ఆయ‌న తాజాగా బీజేపీలో చేరారు. అల్పేశ్ ఠాకూర్ తన సహచర మాజీ ఎమ్మెల్యే ధవళ్‌సిన్హ్ జాలాతో కలిసి గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు జీతూ వఘానీ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలిద్దరూ తమ మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. వీరిద్దరు ఈ నెల 5న తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ప్రతిపక్షంలో ఉండటం వల్ల పేదలకు సాయం చేయలేకపోతున్నానని, అందుకే బీజేపీలో చేరానని అల్పేశ్ తెలిపారు. 


కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయిన‌ అల్పేశ్, జాలా ఈనెల 5న గుజరాత్‌ రాజ్యసభ ఉప ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన అనంతరం పార్టీకి రాజీనామా చేశారు. ప్రజలకు, తన కులస్థులకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన తాను గత రెండేళ్లుగా వారికి ఏమీ చేయలేకపోయానని వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో అవమానం, వంచనకు గురైనందునే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు అల్పేశ్ అప్పట్లో వివరణ ఇచ్చారు. నిజాయితీ గల నేతలు కాంగ్రెస్ పార్టీలో అణచివేతకు గురవుతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేతలకు తాను అనేకమార్లు విన్నవించానని, రాహుల్ గాంధీపై ఉన్న నమ్మకంతోనే ఆ పార్టీలో చేరినప్పటికీ ఆయన ఏమీ చేయలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. పదేపదే అవమానాలకు గురయ్యామని చెప్పారు. అంతరాత్మ ప్రబోధం ప్రకారమే నిజాయితీ కలిగిన జాతీయ నాయకత్వానికి తాము ఓటేస్తున్నట్టు పరోక్షంగా బీజేపీకి ఓటు వేస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మానసిక ఒత్తిడికి గురికావడం మినహా తనకు ఒరిగేందేమీ లేదని, ఇప్పుడు ఆ బరువు దించుకున్నానని అన్నారు. 


అయితే, ఒక‌ద‌శ‌లో కాంగ్రెస్ నేత‌ల‌కు అల్పేశ్కు మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగింది. పార్టీ గుజరాత్ యూనిట్ పనితీరు పట్ల తాను సంతోషంగా లేనని అల్పేష్‌ చెప్పారు. పార్టీ అధ్యక్షుడికి కూడా ఆ విషయం చెప్పానని, యువనేతలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పానని అన్నారు. తన విషయం తాను చెప్పుకోవడం లేదని, తనకు తగిన గుర్తింపే ఇచ్చారని చెప్పారు. ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన కొన్ని డిమాండ్లు తాను ప్రస్తావించినప్పటికీ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అల్పేశ్ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ నేతలు సైతం విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీకి బీ-టీమ్‌గా అల్పేశ్ వ్యవహరిస్తున్నారని, ఠాకూర్ల డిమాండ్లంటూ ఆయన చేస్తున్న వాదన చూస్తే బీజేపీలో చేరే అవకాశాలే కనిపిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడేది లేదంటూ అల్పేశ్ వివరణ ఇచ్చారు. అయితే, అనంత‌రం ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి తాజాగా బీజేపీలో చేరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: