రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించిన పెద్ద సంచ‌ల‌నం ఒక‌టి  చోటు చేసుకుంది. రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించి ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణాన్ని తెచ్చుకుని ప‌నులు ప‌రుగులు పెట్టించాల‌ని భావించిన ప్ప‌టికీ.. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ప్ర‌య‌త్నానికి బ్రేక్ ప‌డింది. సుమారు రూ.7,200 కోట్ల రుణం ప్రతిపాదనను తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో ప్రపంచబ్యాంకు ఉపసంహరించుకుంది. రాజధాని నిర్మాణానికి రూ.7200 కోట్ల రుణం కోసం సీఆర్‌డీఏ 2016 మార్చిలో ప్రపంచబ్యాంకుకి ప్రతిపాదన అందజేసింది. తొలి దశలో రూ.3,600 కోట్లు, రెండో దశలో మరో రూ.3,600 కోట్లు బ్యాంకు నుంచి తీసుకోవాలనేది ప్రతిపాదన. బ్యాంకు కూడా సూత్రప్రాయంగా ఆమోదించింది. 


తాము మంజూరు చేసే రుణంలో 30 శాతం నిధులతో ముందస్తుగా రాజధానిలో పనులు చేపట్టేందుకు కూడా బ్యాంకు అంగీకరించింది. సీఆర్‌డీఏ మొదట ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణంతో ఈ ప్రాజెక్టులు చేపడితే, ప్రపంచబ్యాంకు రుణం మంజూరయ్యాక ఆ నిధుల్ని వాటికి తిరిగి చెల్లించవచ్చునన్నది ఆలోచన. రాజధానిలో ఏడు ప్రాధాన్యతా రహదారుల నిర్మాణాన్ని ప్రపంచబ్యాంకు నిబంధనలకు లోబడే సీఆర్‌డీఏ నిర్మిస్తోంది. అయితే, రాజ‌ధానికి సంబంధించి గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొన్ని అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌లు రావ‌డంతో అప్ప‌టి ప్ర‌తిప‌క్షం వైసీపీ దీనిపై ప్ర‌పంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసింది. 


రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు వ్యతిరేకంగా ఉన్న రైతులు కొందరు రాజధానిలో చేపడుతున్న ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానల్‌కి 2017 మే 25న ఫిర్యాదు చేశారు.  కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి జత కలిశాయి. దీనిపై ఇన్‌స్పెక్షన్‌ ప్యానల్‌  బ్యాంకు యాజమాన్యాన్ని వివరణ కోరింది. 2017 సెప్టెంబరు 12 నుంచి 15 వరకు తనిఖీ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. రైతులతో పాటు, రాజధానిలోని వివిధ వర్గాల ప్రజల్ని, ప్రభుత్వ అధికారుల్ని కలిసింది. సెప్టెంబరు 27న ప్రాథమిక నివేదిక అందజేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేసింది. 


ఇక‌, ఈ విష‌యం తాజాగా అసెంబ్లీలో తీవ్ర దుమారాన్ని రేపింది. రాజ‌ధానిని క‌డుతుంటే.. మీరు కావాల‌నే అడ్డుప‌డి లేఖ‌లు రాయ‌డం, ఫిర్యాదులు చేయ‌డంతో నిధుల రుణాల విష‌యంలో ప్ర‌పంచ బ్యాంకు వెన‌క్కి త‌గ్గింద‌ని, ఈ పాపం మీదేన‌ని టీడీపీ తీవ్ర‌స్థాయిలో ఆరోపించింది. అయితే, నిబంధ‌న‌లు పాటించ‌డం మానేసి, బ‌క్క‌చిక్కిన రైతుల నుంచి భూముల‌ను బ‌ల‌వంతంగా లాక్కుని, మీ ఇష్ట‌మైన వారికి కేటాయింపులు చేయ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని వైసీపీ ఎదురు దాడి చేసింది. ఏదేమైనా.. ఇప్పుడు మొత్తానికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన అమ‌రావ‌తి నిర్మాణం.. పూర్తిగా చ‌తికిల ప‌డింద‌నే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: