తెలంగాణ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌దైన శైలిలో మ‌రోమారు కీల‌క ప్ర‌క‌ట‌నలు చేశారు. మున్సిపాలిటీ చట్టం - 2019పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ...తెలంగాణ మున్సిపల్ చట్టం -2019తో పూర్తి పారదర్శకత వస్తుందని  తెలిపారు. ``ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో భారీ జరిమానా ఉంటుంది. ఇంటి కొలతల విషయంలో అబద్ధాలు చెప్తే 25 రెట్లు జరిమానా విధిస్తాం. ప్రజలను నమ్ముతున్నాం, వారిని విశ్వసిస్తున్నాం. ప్రజలేవరూ లంచాలకు ఇవ్వొద్దు. అధికారాన్ని ప్రజలు దుర్వినియోగం చేయొద్దు.. సద్వినియోగం చేసుకోవాలి. అక్రమమైన బిల్డింగ్ కడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. చట్టం కఠినంగా ఉంది. బీఆర్‌ఎస్ వంటి కేసుల్లో చాలా సందర్భాల్లో హైకోర్టు ముందు కూడా తల దించుకోవాల్సి వచ్చింది. అక్రమ కట్టడాలను రాష్ట్రంలో ఎక్కడా, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. ఆగస్టు 15వ తేదీ నుంచి రియల్ టైమ్ పరిపాలనా సంస్కరణలు తీసుకురాబోతున్నాం. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అద్భుతంగా పని చేస్తాం. భారతదేశం అబ్బురపడే విధంగా పని చేయబోతున్నాం`` అని ప్ర‌క‌టించారు. 


పని చేయని సర్పంచ్‌లు, చైర్‌పర్సన్‌లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లపై చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ల పాత్ర మరింత కీలకం చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. `` కలెక్టర్ తీసుకున్న చర్యలపై స్టే ఇచ్చే అధికారం మంత్రి నుంచి తొలగించాం. సర్పంచ్‌ను తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉంది. ఒక సర్పంచ్‌ను కలెక్టర్ తొలగిస్తే.. సదరు సర్పంచ్ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే, 12 గంటలకు మంత్రి ఇంట్లో కనిపిస్తాడు. సస్పెండ్ ఆర్డర్‌పై ఒంటి గంటకు స్టే వస్తది.. మళ్లా.. కలెక్టర్ ముందు కాలర్ ఎగరేసుకుంటూ కూర్చుంటడు సర్పంచ్. ఇది ప్రస్తుత పరిస్థితి. అందుకే ఇప్పుడు మంత్రి ఇచ్చే స్టే అధికారాన్ని తీసేశాం. నియంత్రణ జరగాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను చట్టంలో తీసుకువచ్చాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ చట్టం చదువుకోవాలి. చట్టం చదవకుండా తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదు. కొత్త పురపాలక చట్టం కొందరికి నచ్చకపోవచ్చు. ప్రజాప్రతినిధులందరూ కచ్చితంగా శిక్షణలు పొందాలి. చట్టం పాస్ చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని నేనే కోరాను`` అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.


కొత్త మున్పిపల్ చట్టంతో పూర్తి పారదర్శకత వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ``75 చదరపు గజాలలోపు జీప్లస్ వన్ ఇల్లు కట్టుకోవడానికి అనుమతి అవసరం లేదు. 75 గజాల లోపు కట్టుకున్న ఇంటికి ఆస్తిపన్ను కేవలం రూ.100 మాత్రమే. 75 గజాల లోపు కట్టుకున్న ఇంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కేవలం ఒక రూపాయే``అని సీఎం కేసీఆర్ తెలిపారు. ``15వ ఫైనాన్స్ కమిషన్ అధ్యయనాలు పూర్తి కావొస్తున్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామీణ ప్రాంతాలకు రూ.1600 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.1030 కోట్లు వస్తున్నాయి. 500 జనాభా ఉండే చిన్న గ్రామానికి కూడా నిధులు పుష్కలంగా వస్తాయి. ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం వచ్చే నిధులకు సమానంగా మనం కూడా సమకూర్చుకుంటాం. పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధుల కొరత ఉండదన్నారు. యూరప్, అమెరికా లాంటి దేశాల్లో కూడా సమస్యలుంటాయి. కొత్త మున్సిపల్ చట్టంలో కలెక్టర్లకు విశేష అధికారాలు కల్పించాం` అని సీఎం వెల్లడించారు.  


కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు కొన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్‌తో పాటు మీర్‌పేట్, జిల్లెలగూడను కలిపి మీర్‌పేట మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లుగా ఈ చట్టం ద్వారానే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీని వల్ల జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఈ కొత్త కార్పొరేషన్ల మధ్య సామరస్యం పెరిగి మంచి ఫలితాలు రాబట్టగలుగుతాయి. స్థానిక శాసనసభ్యుల అభ్యర్థనల మేరకు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు మాత్రమే ఉంటాయి. పారదర్శకంగా అనుమతులు లభించేందుకు వీలుగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రిగా పూర్తి అవగాహనతో ఈ చట్టం రూపకల్పన చేశాం. చట్టంలోని ప్రతి వాక్యం నేనే రాయించాను అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: