కాంగ్రెస్ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి మ‌రోమారు త‌న‌దైన శైలిలో కల‌క‌లం సృష్టించారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న టైటానిక్ నౌక అని పేర్కొంటూ...దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమ‌ని పేర్కొన్నారు. `నేను బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్రంలో యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతుంది. నేను బీజేపీపార్టీలో ఏ కండీషన్స్ లేకుండా చేరుతాను. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉంది. నేను ఓ కార్యకర్తకు భ‌రోసా ఇచ్చేందుకు మాట్లాడిన మాటలను హైలెట్ చేసారు.. ఇప్పుడు ఆ వ్యక్తి టీఆర్ఎస్ లో చేరిపోయాడు. నియోజకవర్గ ప్రజలు నావెంట వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. బీజేపీలో నాకంటే సీనియర్ నేతల చాలా మంది ఉన్నారు.. నేను ఓ సాధారణ కార్యకర్తలా పార్టీ ఏ బాధ్యత ఇస్తే దానికి కట్టుబడి ఉంటాను. పార్టీ బ‌లోపేతం కోసం కృషిచేస్తాను. మరో 20ఏళ్ళ వరకు బీజేపీనే అధికారంలో ఉంటుంది. వచ్చే జమిలీ ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ విజయం ఖాయం`` అని వ్యాఖ్యానించారు. 


త‌నకు పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ తానే వద్దన్నాన‌ని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ``ఇప్పుడు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరుంది. నేను బీజేపీలో చేరాక కాంగ్రెసోళ్లందరూ బీజేపీలో చేరుతారు. బీజేపీలోకి టీఆరెస్ ఎమ్మెల్యేల‌ను తీసువెళ్లేందుకు ..నేను ఎవరితో మాట్లాడటం లేదు. టీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం. కోమటిరెడ్డి బ్రదర్స్ బిజెపిలోకి వెళుతున్నారంటే టీఆరెస్ భయపడుతుంది`` అని వ్యాఖ్యానించారు. 


త‌న లాంటోడు పార్టీలో చేరితేనే బీజేపీ బలపడుతుంద‌ని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. ``త్వరలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరుతారు. నేను బీజేపీలో చేరినా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయను. కాంగ్రెస్ మునిగే పడవ. టైటానిక్ ఓడలో నాలాంటి హీరో ఉన్నా మునిగిపోవాల్సిందే` అని వ్యాఖ్యానించారు. కాంగా, అసెంబ్లీ వేదిక‌గా కోమ‌టిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఈ కామెంట్ల‌పై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: