ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ప్రతీకార చర్యలతో వాడి వేడిగా హోరెత్తుతున్నాయి.  అధికారపక్షం ఆరోపణలతో ప్రతిపక్షం ప్రత్యారోపణలతో రణరంగాన్ని తలపిస్తున్నది నేటి ప్రజాస్వామ్య వేదిక.  ఎంత సేపు గత ప్రభుత్వాన్ని వేలెత్తి చూపాలన్న ప్రయత్నంలో అధికారపక్షమైతే, వారిని ఎదుర్కొనే ప్రయత్నంలో పాలకపక్షాన్ని తప్పుపడుతోంది ప్రతిపక్షం.  నేడు అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే ప్రజా సమస్యలు సరేసరి, వ్యక్తిగత ప్రతీకార చర్యలన్న విషయం సామాన్యుడికి సైతం అర్ధం అయ్యేలా ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు.

గడిచిన 50 రోజుల వ్యవధిలో కొత్త ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి కాని, చేపట్టబోయే కార్యాచరణాల గురించి గాని వీసమెత్తయినా చర్చ జరగలేదు సరి కదా నాటి ప్రభుత్వపు లోపాలను ఎత్తి చూపే ప్రయత్నంలో ప్రతిరోజూ పెద్ద యుద్ధమే జరుగుతోంది.  అటు ప్రతిపక్షం కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎదురుదాడి చెయ్యడంతో సభ సజావుగా జరగడమే కరువయింది.  ఈ దరిమిలా సభా మర్యాద అన్నది సదరు ప్రజాప్రతినిధులు పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలతో  అసెంబ్లీ సమావేశాలను మాంచి మసాలా సినిమాను తలపింపజేస్తున్నారు.  సాక్ష్యాత్తు అటు ప్రతిపక్ష నాయకుడు, ఇటు ముఖ్యమంత్రే విసుర్లు, అరుపులతో అసెంబ్లీని నాలుగురోడ్ల కూడలిగా మార్చడం విచారకరం.  నాయకులే ఇలా వుంటే వారి వెంట వున్నవారు నాలుగు ఆకులు ఎక్కువ తిన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే గొర్రెలు కూడా ముందు గొర్రెలను అనుసరించేముందు మంచీ చెడు ఆలోచిస్తాయేమోకాని నేటి రాజకీయ ప్రతినిధులు మాత్రం గుడ్డిగా నాయకుడిని అనుసరించడం నిజంగా మన దౌర్భాగ్యం.  చిన్నపిల్లలు పొరపాటున టీవి లో అసెంబ్లీ ప్రసారాలు చూస్తే ‘ఇది ఏం సినిమా ?’ అని అడిగే స్థాయి కి దిగజార్చారు మనల్ని ఏలుతున్న, ఏలాలనుకున్న ప్రబుద్ధులు.   గుడికి వెళ్ళినపుడు భక్తిభావనతో, బడికి వెళ్ళినపుడు చదవాలన్న ధ్యాసతో ఎలా ప్రవర్తిస్తామో అసెంబ్లీలో అడుగుపెట్టినపుడు ప్రజాప్రతినిధుల ఆలోచనలు సక్రమంగా వుంటే ప్రజలకు, రాష్ట్రానికి శ్రేయస్కరం.

నిజంగా ప్రజాహిత నాయకులైతే తమ భావోద్వేగాలను అదుపులో వుంచుకొని ప్రజా సమస్యలపై చర్చలు చేపట్టి పరిష్కార దిశగా అడుగులు వేస్తే అంతకంటే ప్రజలకు కావాల్సిందేముంటుంది. రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది...అలానే ప్రతిపక్షం, పాలకపక్షం సామరస్యంగా పని చేస్తేనే ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనం.


మరింత సమాచారం తెలుసుకోండి: