తెలుగు రాజకీయాల్లో స్ప‌ల్ప‌కాలం పాటు ఓ వెలుగు వెలిగి అంతే వేగంగా తెర‌మ‌రుగు అయిన సమైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. సొంత గూటి నుంచి ఆయన మ‌రో జాతీయ పార్టీలో చేరే అవకాశాలున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది.కాంగ్రెస్ నేత‌గా ఉన్న‌ప్ప‌టికీ, క్రియాశీల రాజకీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న బీజేపీ గూటికి చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా అదే నిజ‌మ‌ని బీజేపీ నేత‌లు వెల్ల‌డిస్తున్నారు.  ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ఊహించని నేతలు పార్టీలోకి వస్తున్నారని, ఈ జాబితాలో మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉన్నార‌ని తెలిపారు.


ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్య‌మం ప‌లితంగా కేంద్రం చేసిన రాష్ట్ర విభజన తీర్మానాన్ని తిప్పికొట్టి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా కిర‌ణ్ కుమార్ రెడ్డి చెప్పి పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై సైద్ధాంతిక సమరం చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జైసమైక్యాంధ్ర పార్టీతో ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే నాటి ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న కిరణ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకొని ఈ మేర‌కు కండువా క‌ప్పుకొన్నారు. అనంత‌రం ఆ పార్టీలో ఉండినే ఇటీవ‌ల ఎన్నిక‌ల‌ను ఎదుర్కున్నారు. అయితే, ఏపీలో కాంగ్రెస్ కోలుకునే అవ‌కాశం లేక‌పోవ‌డం, మ‌రోవైపు బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో కిర‌ణ్‌కుమార్ రెడ్డి బీజేపీ గూటికి చేర‌నున్నార‌ని తెలుస్తోంది. 


కిర‌ణ్‌కుమార్ రెడ్డి చేరిక గురించి ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ఊహించని నేతలు పార్టీలోకి వస్తున్నారని అన్నారు. ఆ నేత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని కూడా తెలిపారు .  ఆయన తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇంకొద్దిరోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని అన్నారు. ఇదిలాఉండ‌గా, ఇప్పటికే బీజేపీ నాయకత్వం కిరణ్‌తో మాట్లాడిందని సమాచారం. వచ్చే నెలలో ఆయనే దీనిపై స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజేపీలో చేరిన తర్వాత కిరణ్‌కు ఎఐసిసిలో కీలక పదవి ఇస్తారనే హామీ లభించినట్లు కూడా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: