ఎవరు అవున‌న్నా కాదన్నా చంద్రబాబు రాజకీయంగా గండర గండడు. ఆయన రాజకీయ చాణక్యం చాలా గొప్పది. ఆయన టార్గెట్ చేశారంటే రీచ్ కావాల్సిందే. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి పెట్టినా దాన్ని క్షేత్ర స్థాయి నుంచి పెంచి పెద్ద చేసింది మాత్రం చంద్రబాబే. బాబుకు పార్టీ లోతుపాతులన్నీ తెలుసు. 


అటువంటి బాబు చేతిలో పార్టీ ఇపుడు ఎలా ఉంది అంటే బాధాకరమైన సమాధానం వస్తుంది. టీడీపీలో బాబు మాట ఇపుడు వినేవారు ఎవరైనా  ఉన్నారా అంటే సమాధానం లేదు. పార్టీలో బుద్దా వెంకన్న, కేశినేని నాని ఎపిసోడ్ ఓ వైపు, మరో వైపు జేసీ ప్రభాకరరెడ్డి లాంటి వారు బీజేపీలో టీడీపీని విలీనం చేసుకోమని డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.


ఇక సుజనా చౌదరి వంటి ఎంపీలు పార్టీ ఫిరాయించి దర్జాగా విజయవాడలో బాబుని విమర్శించినా ఏమీ ఎవరూ అనలేని పరిస్థితి .  పూటకొకరుగా పార్టీని వదిలి వెళ్ళిపోతూ టీడీపీని, లోకేష్ ని తిడుతున్నా కిమ్మన‌ని తమ్ముళ్లు అసలు సైకిల్ పార్టీలో ఏం జరుగుతోంది. బాబు వంటి  చండశాసనుడు అధినేతగా  ఉన్న పార్టీయేనా అంటే జవాబు లేదు.


టీడీపీని పదేళ్ల పాటు అధికారంలో లేనపుడు కూడా నడిపించి 2014 ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చిన ఘనుడు చంద్రబాబు, అయితే అప్పట్లో ఆయనకు వయసు ఉంది. క్యాడర్ మీద పట్టుంది. ఇపుడు చూస్తే రెండూ లేవు. బాబుతో పార్టీ కోసం మాట్లాడే నాయకులు ఎవరూ లేరు, బాబు అసెంబ్లీలో వైసీపీతో ఒంటరి పోరాటం చేస్తూంటే గెలిచిన ఎమ్మెల్యే తమ్ముళ్ళు పట్టించుకోని పరిస్థితి. 


మొత్తానికి బాబు కు కాని కాలం వచ్చింది. టీడీపీని పాతికేళ్ళుగా అధినాయకుడిగా అదిలించిన బాబు అదే పార్టీలో ఒంటరి. బాబుకు ఇది మొదలు, మరిన్ని షాకులు ఆయన పార్టీకి తప్పవంటున్నారు. ఇదే తీరులో పార్టీ ఉంటే 2024 ఎన్నికల ఫలితాలు చెప్పనవసరం లేదన్న మాట కూడా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: