జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా చేపట్టిన గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన మార్గదర్శక ఉత్తర్వులను పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ విభాగం శుక్రవారం (జులై 19) విడుదల చేసింది. గ్రామ సచివాలయాల ఆవశ్యకత, చేపట్టాల్సిన విధులను గురించి ఉత్తర్వుల్లో పేర్కొంది.


మొత్తం 91,652 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌‌ను అతిత్వరలో విడుదల చేయనుంది. ఇందులో కొత్త పోస్టులు 77,554 కాగా.. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులు 14,098 ఉన్నాయి. గ్రామ సచివాలయ పోస్టులకు జులై 19 నుంచి 22 తేదీల మధ్య ఉద్యోగాల నియామక ప్రక్రియ ఉంటుంది. అనంతరం జులై 23 నుంచి సెప్టెంబరు 15 వరకు నియామక పత్రాలు ఇస్తారు. నియామక పత్రాలు పొందినవారికి సెప్టెంబరు 16 నుంచి 28 వరకు శిక్షణ ఇస్తారు.


శిక్షణ అనంతరం వీరంతా అక్టోబరు 2 నుంచి ఆయా గ్రామ సచివాలయాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. నియామక పత్రాలు పొందిన అభ్యర్థులకు బాపట్ల, సామర్లకోట, కాళహస్తిలోని పంచాయతీ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణనివ్వనున్నారు. నియామకాలు పొందినవారికి రూ.15 వేల స్టైఫండ్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ అమల్లో ఉంటుంది. వీరికి డీడీఓ (డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌)గా పంచాయతీ సెక్రటరీ వ్యవహరించనున్నారు. పంచాయతీ సెక్రటరీలకే గ్రామ వాలంటీర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: