ఇటివల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడి నేతృత్వంలో బిజెపి పోటీచేయడం, అనుహ్యరీతిలో మునుపెన్నడు లేని ఘనమైన విజయం సాధించి రెండవసారి ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఎంతో వేగంగా చరిత్రలో నిక్షిప్తమైపోయింది. 1971 వ సంవత్సరం తర్వాత ఒక అధికార పార్టీ ఈవిధమైన రికార్డు స్థాయి మెజారిటీ గెలుచుకోవదమనేది ఇదే ప్రధమం, అయితే ఈ విజయం ఎంతమేరకు అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపుతుంది, సరిహద్దు దేశాలతో పాటు ప్రపంచ శక్తులైనటువంటి అమెరికా, రష్యా మరియు చైనా దేశాల సంబంధాలపై ఏస్థాయిలో ప్రభావం ఉండగలదు అనేటువంటి అంశాలు ఒక ఆసక్తికరమైన విశ్లేషణకు అవకాశం కలిగిస్తున్నాయి.

 

ఇప్పటికే భారత్ కు ఇరాన్ తో కలిగిఉన్న ఆయిల్ దిగుమతి ఒప్పందం ప్రస్తుత ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెడుతోంది. అమెరికా,ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆంక్షలు వెరసి అమెరికా అనుసరిస్తున్న ధోరణి, దుడుకు వైఖరి మొదలైన విషయాలు మన ఆయిల్ దిగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఆశిస్తున్న అంతర్జాతీయ పెద్దరికం దశలవారిగా మన ప్రయోజనాలకు దెబ్బకోడుతున్నది. ప్రపంచ దేశాలపైన అమెరికా విసురుతున్న ఆంక్షల దెబ్బల నుండి మనదేశం మినహాయింపు పొందడం ఒకరకంగా మన దౌత్య విజయమనే చెప్పుకోవాలి, కానీ అమెరికానుండి ఇంకెతమాత్రం ఈ సడలింపు కొనసాగే అవకాశం కనపడటం లేదు.

 

మోడీ మున్ముందు మరింత క్లిష్టమైన భిన్న ధ్రువ ప్రపంచాన్నిఎదుర్కొవాల్సిఉంటుంది, అంతర్జాతీయంగా రాజకీయ ఆర్ధిక సవాళ్లు ఒకదానిపైన మరొకటి పెనవేసుకొని జటిలంగా

 

మారిపోయాయి. అమెరికా, చైనా మరియు అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న వ్యాపార, రాజకీయ యుద్దాలు కావచ్చు లేదా అమెరికా రష్యా , అమెరికా యూరప్ మధ్య సడలిపోతున్న రాజకీయ బంధాలు కావచ్చు, ఏమైనా మోడీ విదేశీ నీతి ఇపుడు మరింత పదును, చాకచక్యం సంతరిచుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి ఐదుసంవత్సరాల పర్యాయం లో మోడీ ప్ప్రభుత్వం అవలంబించిన విదేశీ వ్యవహారాలు ఈ పర్యాయం వ్యూహాత్మకంగా మరింత మెరుగుపడాలి. లోగడ పాకిస్తాన్ కేంద్రంగా అనుసరించిన ఉగ్రవాద నిర్మూలన విధానం, ఇరుగుపొరుగు దేశాలతో సఖ్యత స్నేహబంధాలు,అమెరికా, రష్యా, చైనా వంటి ప్రపంచ శక్తులతో జాగరూకతతో కూడిన దౌత్య వ్యవహారాలు కొనసాగిస్తూనే మన దేశ స్థానాన్ని మరింత సుస్థిరం, శక్తివంతం చేసుకునే విధంగా ప్రస్తుత విదేశి విధానం రూపకల్పన జరగాలి.

 

మొదటి పర్యాయం మోడీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పుడు పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాద నిర్మూలన అనేది ముఖ్యమయిన సమస్యగా ఉంది అందుకే తక్షణ చర్య అవసరమైంది. ప్రభుత్వం కూడా తదనుకూల విదేశీ విధానాన్ని పాటించడం జరిగిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంఘటనలు బాధిస్తే, చివరి సంవత్సరం లో వాయుసేన చేసిన ఆకాశ దాడులతో ఇరుదేశాల బంధాలు మరింత క్షీణదశకు చేరుకున్నాయి. మొదటి ఐదు సంవత్సరాల పర్యాయం ముగిసింది, పాకిస్తాన్ తో సత్సబంధాలకు ఎటువంటి అవకాశం దొరకలేదు. దశాబ్దాలనుండి వేధిసున్న జమ్మూ- కాశ్మీర్ సమస్య పాకిస్తాన్ తోడ్పాటుతో ఇటివల మరింత తీవ్ర రూపం దాల్చడం లాంటివి రెంటి దేశాలమధ్య ఉద్రిక్తతలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణమయ్యాయి. భారతీయ మాజీ నావికాధికారి కులభూషణ్ జాదవ్ మరణశిక్ష ఉదంతం కూడా ప్రస్తుతం ఒక ప్రతికూల వాతావరణాన్ని రెండు దేశాలమధ్య కలగచేస్తున్నది.

 

ఇతర సరహద్దు దేశాలతో కూడా మన విదేశీ నీతి కాస్త మీరినట్లు కనపడుతోంది. లోగడ 2015 వ సంవత్సరంలో జరిగిన నేపాల్ దిగ్బంధనం దీనికి సాక్ష్యమైంది. సరిహద్దున ఉన్నచిన్న దేశాల సమావేశాలలో పెద్దన్న పాత్రలో మన ఆధిపత్య ధోరణి బట్టబయలైంది మన ప్రతిష్ట మసకబారింది. గడచిన రెండు సంవత్సరాలలో రెండు శ్రీలంక, నేపాల్ వంటి చిన్నదేశాలతో

 

సంబంధాలు కొంత వృద్ది చెందినా మరింతగా పెంచడానికి కృషి చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది.

 

అమెరికాను మోడీ మరింత దగ్గర చేసుకోవడం మీద ఆసక్తి కనబరచడం వెనుక డోనాల్డ్ప్ ట్రంప్ కరకువైఖరి,డోలాయమానశైలి ముఖ్య భూమిక పోషించాయనుకోవచ్చు. కాగా ఇది మరొక విధంగా లాభదాయకంగా పరిణమించి గడచిన సంవత్సరంలో రష్యా, చైనా లతో రెండు అనధికారిక సమావేశాలకు దారితీసింది, తద్వారా ఆయా దేశాలతో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు మరింత సానుకూల స్థితి ఏర్పడింది.

 

మోడీ ఒక ఇంటర్వ్యూ లో ఇటివల జపాన్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశాలు గురించి ప్రస్తావిస్తూ ఏవిధంగా భారతదేశం అంతర్జాతీయంగా తన ప్రాధాన్యతను పెంచుకుంది, జపాన్ తో సహా రష్యా,చైనా, అమెరికా లాంటి శక్తివంతమైన దేశాలు మనతో మైత్రి సంబంధాలు పెంచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేసారు. భారత్,అమెరికా,జపాన్ మరియు భారత్,రష్యా,చైనా లు పాలుపంచుకున్న రెండు సదస్సుల్లోనూ ముఖ్య పాత్ర ‘భారత్’ కావడం ఒక మంచి పరిణామంగా ఆయన పేర్కొనడం ఇక్కడ గమనార్హం.

 

ఇకపోతే ఈ సంవత్సరం భారత్ కేంద్రంగా చైనా తీరు తెన్నూ కొంత మారినట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ 1267 ఆంక్షల కమిటి పాకిస్తానీ పౌరుడు మసూద్ అజర్ను అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా ప్రకటించి బ్లాక్ లిస్టు లో పెట్టడం మనకు ఒక దౌత్య విజయమైతే ఎట్టకేలకు దీనికి చైనా తన సమ్మతి తెలియజేయడం మన దౌత్య విధానంలో ఒక ముందడుగు కిందే లెక్కించొచ్చు. కనీసం ఒక దశాబ్దం పాటు చైనా పాకిస్తాన్ కు ఈ విషయంలో బహిరంగ మద్దతు తెలియజేసింది. ఇపుడైతే చైనా ఈ విషయాన్ని తన పరిధి నుండి ప్రపంచ స్థాయి కి తీసుకోనివేల్లడమనేది చాలా కీలక మార్పుగానే చూడాలి. అయినా ఇప్పటికీ చైనా పాకిస్తాన్ మధ్య బలమైన బంధాలే ఉన్నాయి. పాకిస్తాన్ లో నానాటికీ పెరుగుతున్న చైనా పెట్టుబడులు, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్, ఇరు దేశాలమధ్య ఉన్న బలమైన రక్షణ ఒప్పందాలు, ఇవన్ని భారత్ కు తలనొప్పి కలిగించే అంశాలే.

 

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన చైనా బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ కు భారత్ వరుసగా రెండవ సారి గైర్హాజరు అయింది. తద్వారా ఒకరకంగా ఆ ప్రాజెక్ట్ మీద మన నిరసన చైనా కు తెలియచెప్పగలిగింది. చారిత్రకంగా భారత చైనా సంబంధాలు ఏ రొజూ సాఫీగా ఉండలేదు. ఒక కోణంలో చైనా విషయంలో మోడీ ప్రభుత్వం అమెరికా విధానాలకు మద్దతుగా నిలువవచ్చు, జపాన్ తో మరింత సాన్నిహిత్యం ఆశించవచ్చు. ఒకరకంగా వీటిని చైనాతో మనకున్న దౌత్య విధానాలకి ప్రత్యామ్నాయాలు అనుకునే అవకాశం లేకపోలేదు. అమెరికా చైనా మరియు జపాన్ చైనా సంబంధాలు కూడా భారత్ చైనా సంబంధాల మాదిరే అసంతులమైనవని ఇక్కడ మనం గుర్తించాలి.

 

భారత విదేశీ విధానంలో ఎన్నదగ్గ మరొక ముఖ్య దేశం రష్యా. భారత, రష్యా సంబంధాలు కాలపరీక్షకి తట్టుకుని నెగ్గి స్థిరంగా ఉన్నాయి. రష్యా గత ఆరు దశాబ్దాలనుండి మనకు బలమైన మిత్ర దేశంగా ఉంది, మరొకవైపు అమెరికాను అన్నివేళలా నమ్మలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే భారత, రష్యా సంబంధాలు రాజకీయ స్థాయి దాటి వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి వరకు వృద్ధి చెందాయి.ఈ వ్యవహారం సహజంగానే అమెరికాకు రుచించడంలేదు, కారణం అమెరికా, రష్యాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ముదురుతున్న సైద్ధాంతిక వైవిధ్యాలు, రాజకీయ వైషమ్యాలు. ఏమైనా ప్రస్తుత భిన్న ధ్రువ ప్రపంచంలో భారత్ ఎ ఒక్కరి వైపు నిలబడకుండా సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉంది. స్వతంత్రమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకం ఒకరకంగా ప్రస్తుత భారత విదేశీ విధానం ఆ దిశలోనే సాగుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇది మంచి పరిణామమే. ఇటీవల అమెరికా అంక్షల హెచ్చరికల మధ్య భారత్ రష్యా నుండి S-400 క్షిపణి నిరోధక వ్యవస్థను కొనుగోలు చేయడం అనేది మన స్వతంత్ర సార్వభౌమ నిర్ణయాధికారానికి ప్రతీకలా నిలబడింది అదే విషయం ప్రపంచానికి తెలియజేసింది. దీనికి ప్రతిగా అమెరికా, పశ్చిమ దేశాలనుండి కుడా కొన్నిరకాల ఉన్నత శ్రేణి ఆయుధ పరికరాలు దిగుమతి చేసుకోవడం భారత్ కు తప్పనిసరికావచ్చు మరి అపుడైతే రష్యా చేయబోయే ఆక్షేపణలు కుడా చెల్లబోవు. కాని ఈ విషయం లో ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగి ఆయా దేశాధిపతులతో వ్యక్తిగత దౌత్యం

 

నడరపాల్సి ఉంటుంది. విదేశీ మంత్రిత్వశాఖ అంత సున్నితమైన కార్యాన్ని నేరవేర్చలేకపోవచ్చు.

 

నేటి నవీన యుగంలో విదేశీవ్యహారాలు, అంతర్జాతీయ సంబంధాలు అనునిత్యం మార్పులు చెందుతున్నాయి. ఎ దేశానైనా మిత్రదేశం లేదా శత్రుదేశం అని ఇతిమిద్ధంగా చెప్పలేము. అంతిమంగా దేశప్రయోజనాలే ముఖ్యం, వాటిని రక్షించుకోవడమే ప్రస్తుత ప్రభుత్వం విధిగా చేయాల్సిన పని. ప్రధాని మోడీ అన్నట్లు దేశ ప్రజలు స్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇక అయన ప్రభుత్వ నూతన విదేశీ విధానం ఆ ప్రజల కోరికను సాకారం చేస్తుందని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: