తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌నంగా ప్ర‌వేశ‌పెట్టిన మున్సిపల్ చట్టంపై అసెంబ్లీలో చర్చ అనంతరం పలువురు సభ్యులు ప్రస్తావించిన అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సుదీర్ఘ‌ వివరణ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``రాజశేఖర్‌రెడ్డి బతికి ఉన్నపుడు తెలంగాణను బాగా వ్యతిరేకించినరు. వారిని మేమూ వ్యతిరేకించినం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీపై చర్చ వచ్చినపుడు ఆరోగ్యశ్రీని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ ఉన్నపుడు చేశారు. చాలా మంచి పథకం. మేంకూడా కొనసాగిస్తం అని ఇదేసభలో ఇదే సీటునుంచి చెప్పాను. కాంగ్రెస్‌వాళ్లు మాత్రం గుడ్డిగ వ్యతిరేకించడమే మాపని అన్నట్లు వ్యవహరిస్తున్నరు. ఇవి మంచి రాజకీయాలు కావు. అందుకే మీరు ప్రజల్లో ఆదరణ పొందలేకపోతున్నరు. ఇప్పటికైనా సమీక్ష చేసుకొని ఏది వ్యతిరేకించాలి? ఏది సమర్థించాలనే దానిపై ఆలోచించాలి. బయటినుంచి వచ్చే సమాచారం ప్రకారం కూడా అందరూ ఇది చాలా మంచి చట్టం.. ఇదొక్కటే పరిష్కారమని చెప్తున్నరు. కానీ కాంగ్రెస్‌వాళ్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నరో అర్థంకావటంలేదు.``అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు కేసీఆర్ చుర‌క‌లంటించారు.

కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కను ఏమనాలో అర్థం కావడం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ``మేం ఏమీ చేయలేదు.. మీరు కూడా ఏమీ చేయవద్దు అన్న ధోరణిలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. మళ్లీ పాత కథే మొదలుపెట్టినరు. మేం బాగా గొప్పగా చేసినం.. అది అట్లనే ఉండాలి.. మార్చొద్దు.. అన్నరు. ఎందుకు అన్నరో తెల్వదు. సమయానుకూలంగా, సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయకపోతే అది ఘోరతప్పిదం అవుతుంది. భవిష్యత్తు తరాలకు కూడా మనం ద్రోహం చేసినవాళ్లం అవుతాం. చుట్టూ ఏం జరుగుతున్నదో సమీక్షచేసి, దానికి అనుగుణంగా తగిన రీతిలో మార్పులు చేయాలి. కానీ కాంగ్రెస్‌వాళ్ల వైఖరి ఏందో అర్థంకావడంలేదు. నీటి ప్రాజెక్టులు కడతామంటే.. కట్టవద్దు. పవర్ ప్రాజెక్టులు కడతామంటే.. కట్టవద్దు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చేపడతమంటే చేపట్టవద్దు.. కళాభారతి, అసెంబ్లీ, సచివాలయం కడతమంటే.. కట్టొద్దు అంటరు. అంతా యథాతథంగా ఉండాలి.. మేమేం చేయలేదు.. మీరూ ఏమీ చేయొద్దు అనే ఆలోచన కాంగ్రెస్‌వారిలో కనపడుతోంది`` అని సీఎం విమర్శించారు.


``కాంగ్రెసోళ్ల వ‌లే నీళ్ల ప్రాజెక్టుల మీద ఎవరైనా 200 కేసులు వేస్తరా? వాటిని ఎదుర్కొనడానికి మేమెన్ని ఇబ్బందులు పడ్డాం. ఎంత చిత్ర విచిత్రమైన కేసులు వేశారో తెలుసుకుంటే బాధ కలుగుతది. ఒక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లేదు.. మేం పనులు మొదలుపెట్టాం. దానిమీద కేసు వేశారు. చాలా కష్టపడి పర్యావరణ అనుమతి తెచ్చాం. ఈ అనుమతి ఇవ్వొద్దని కేసు వేస్తరు. అంటే మీ ఉద్దేశం ఏంది? ప్రజలకు నీళ్లు రావద్దా? మీ ప్రకారంగా ఇప్పుడు మున్సిపాలిటీలు గొప్పగ ఉన్నయా? ప్రజలకు అవినీతి తప్పుతుందా?`` అని తెలంగాణ‌ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: