న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తికి రుణం విష‌యంలో ప్ర‌పంచ‌బ్యాంకు తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. వైసీపీ టార్గెట్‌గా టీడీపీ విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో....ఆ పార్టీ నేత‌లు సైతం త‌గు రీతిలో స్పందిస్తున్నారు. విజయవాడలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యాలయంలో పెడన ఎమ్మెల్యే జోగిరమేష్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. టీడీపీ నేతలు, ఆ పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు రాజధాని అమ‌రావ‌తి నిర్మాణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయ‌న‌ మండిప‌డ్డారు. రాజధాని ప్రాంత రైతుల విష‌యంలో మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని ఆరోపించారు. ``రాజ‌ధాని రైతుల‌కు మీరు ఏమాత్రం న్యాయం చేశారు? రాజధాని ప్రాంతంలో భూములు కేటాయింపుల దగ్గర్నుంచి అన్నింటా ఉల్లంఘనలే. మంత్రులను, అధికారులను పంపించి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. చంద్రబాబూ రాజధాని రైతులు మీతో కలసి వచ్చారా? అమరావతిని ఓ భ్రమరావతిగా చూపించారు.`` అని మండిప‌డ్డారు. 


రాజధాని పేరుతో చంద్రబాబు అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారని జోగి ర‌మేష్‌ ఆరోపించారు. బాహుబలి గ్రాఫిక్స్ సెట్టింగ్స్, ఎల్లో మీడియా ప్రచారార్భాటాలు తప్ప క‌నీసం రాజధానికి రహదారులు కూడా నిర్మించలేదని మండిప‌డ్డారు.  `రాజధానిలో చంద్రబాబు సర్కార్ అడగడునా ఉల్లంఘనలు చేసింది. దారుణంగా రాజధాని డిజైన్స్ ఇచ్చారు. మకీ సంస్ధ మీ అసమర్ధతను అవినీతిని ఎండగడుతూ బహిరంగ లేఖ రాసింది. ప్రపంచబ్యాంక్ రుణం వెనకకు వెళ్లడం పేరుతో టీడీపీ గ‌గ్గోలు పెడుతోంది. అస‌లు ఆ బ్యాంక్ ఎప్పుడు రుణం ఇస్తానని చెప్పింది?ప్రపంచబ్యాంక్ ద్వారా జూన్ 12 న ఓ లేఖ వచ్చింది. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు.సామాజిక న్యాయం పాటించలేదు.వ్యవసాయ భూమిని ప్రభుత్వం రైతుల వద్దనుంచి లాక్కుంది అని ఆ లేఖలో ఉంది. ఆ నాటికి వైయస్ జగన్ అధికారం చేపట్టి 12 రోజులైంది. చంద్రబాబు నిర్వాహకం వల్లనే ప్రపంచబ్యాంక్ రుణం రాలేదు. చంద్రబాబూ త‌న‌ అసమర్ధత వల్లనే ఇలా జరిగిందని ఒప్పుకోవాల్సింది పోయి ఇలా గ‌గ్గోలు పెడుతున్నారు`` అని మండిప‌డ్డారు.


ఏపీలో చంద్రబాబుదే తుగ్లక్ పాలన అని పేర్కొన్న జోగి ర‌మేష్ లోకేష్ ట్వీట్లు చేసేముందు ఈ విషయం తెలుసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ``చంద్రబాబు రాజధానిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోయారు? ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాజధాని నడిబొడ్డున గృహం నిర్మించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. రాజధాని నిర్మాణం పేరుతో ఎంత దోచుకున్నారో అంతా బయటకు తీయిస్తాం. మేం అధికారంలోకి వచ్చి 50 రోజులే అయినా ప్రజల మనస్సులు చూరగొన్నాం. ఈ విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలుసు`` అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: