ట్రబుల్ షూటర్ గా హరీశ్ రావుకు టీఆర్ఎస్ పార్టీలో మంచి పేరు ఉంది. పార్టీకి అనేక కష్టసమయాల్లో ఆయన అండగా ఉన్నారు. పార్టీని అనేక సార్లు గెలుపుబాట పట్టించారు. అందుకే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోటీ చేసిన కోడంగల్ లో పార్టీని గెలిపించే బాధ్యత కేసీఆర్ హరీశ్ పై ఉంచారు.


హరీశ్ రావు దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత హరీశ్ రావును కేసీఆర్ పూర్తిగా పక్కకు పెట్టేశారు. మంత్రి పదవి కూడా కొనసాగించలేదు. పార్టీలో పదవి లేదు. ఈ నేపథ్యంలో హరీశ్ పరిస్థితిపై రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.


గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించడానికి హరీష్ రావును కేసీఆర్ పనికట్టుకుని పంపారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాంటిది ఇప్పుడు హరీష్ రావు గతి ఏమైందో అంతా చూస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. పొట్టోన్ని పొడుగొడు కొడితే.. పొడుగొన్ని పోశమ్మ కొట్టిందన్నట్టు హరీష్‌రావు కొడంగల్‌ ప్రజలకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రశ్నించే వాడు లేకుంటే పాలించే వాడిదే రాజ్యమవుతుందని గుర్తించిన రాష్ట్ర ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఢిల్లీలో ఉన్నా... కొడంగల్‌ ప్రజల ఆదరణ, అభిమానాన్ని తాను ఎన్నడూ మర్చిపోనని రేవంత్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: