ఆంధ్రప్రదేశ్ లో అద్బుతమైన మెజారిటీ సాధించి జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయి గట్టిగా యాభై రోజులు కాలేదు. ఇంకా 58 నెలల పైబడి పాలన ఆయన చేతుల్లో ఉంది. మరి ఇంతలోనే ఎంత తొందరో ఆ పార్టీకి, మాట మీద  నిలబడని ఆ పార్టీ జగన్ని అనరాని మాటలు అంటూ నోరు కంపు చేసుకుంటోంది


అది చాలదన్నట్లు ఆ నోటితోనే పిల్లి  శాపాలు కూడా పెడుతోంది. జగన్ ప్రభుత్వం మీద కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని, రాష్ట్రపతి పాలన పెట్టే చాన్స్ ఉందని మాజీ ఆర్ధిక మంత్రి యనమల  రామక్రిష్ణుడు జోస్యం చెబుతున్నారు. జగన్ కేంద్రాన్ని ధిక్కరిస్తున్నారుట. అందువల్ల రాజ్యాంగం ప్రకారం రాష్టపతి పాలన పెట్టవచ్చుట. ఇంతకీ ఏ విషయంలో జగన్ ధిక్కరిస్తున్నారు అంటే విద్యుత్ కొనుగోళ్ళపై సమీక్ష జరుపుతానని జగన్ అనడమే మహా పాపంట. ఈ కారణంగా రాష్ట్రపతి పాలన పెట్టేయచ్చట.


అది సరే కానీ ప్రధానికి నల్ల జెండాలు చూపించి నానా బూతులు తిట్టి ఏపీని సొంత దేశంగా అనధికారికంగా ప్రకటించేసుకున్న నిన్నటి తెలుగు దేశం పాలనలో కేంద్రాన్ని ధిక్కరించినట్లుగా రాజ్యాంగ నిపుణుడు  యనమల వారికి  అనిపించలేదా. సీబీఐ, ఐటీ, ఈడీ లను ఏపీకి  రావద్దంటూ చెప్తూ ప్రత్యేక అధికారాలేవో తమకు ఉన్నాయని చెప్పుకున్న నాటి బాబు పాలనలో రాష్ట్రపతి పాలన ఎన్ని సార్లు పెట్టరో మరి.


ఇవన్నీ ఒక ఎత్తు. నిన్నటి దాకా మోడీని నానా తిట్లూ తిట్టిన టీడీపీకి ఇంతలోనే కేంద్రం అంతలా ఎలా నచ్చేసిందో కూడా యనమల వారు చెబితే బాగుండేది. మేము సామంత రాజులమా, బానిసలమా, తెలుగు వారి ఆత్మ గౌరవం , వంకాయా అంటూ కబుర్లు చెప్పిన తమ్ముళ్లకు ఇపుడు జగన్  సాటి తెలుగు వాడు కాదా, ఆయన మీద కేంద్రం యాక్షన్ తీసుకుంటే ఓకేనా ఇది కూడా జవాబు చెబితే బాగుంటుందేమో.


మొత్తానికి యనమలకు మహా తొందరగా ఉంది, జగన్ని ఎంత తొందరగా గద్దె మీద నుంచి దింపేయాలా అని, అవును మరి అయిదేళ్ళ కాలం వేచి చూడాలి. టీడీపీలో ఉన్నవన్నీ షష్టి పూర్తి దాటిన కేసులేగా. అంత ఓపిక ఎక్కడ ఉంటుందని సోషల్ మీడియాలో  సెటైర్లు  పడుతున్నాయి గట్టిగానే
 


మరింత సమాచారం తెలుసుకోండి: