చంద్రునిపైన పరిశోధనలు చేసేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. గతంలో భారతదేశం నుంచి పంపించిన చంద్రయన్ -1 ప్రయోగం విజయవంతం అవడంతో దాదాపు 11 సంవత్సరాలు తర్వాత చంద్రయాన్ -2 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని 15వ తేదీ వేకువజామున ప్రయోగించాలనుకున్న చంద్రయాన్‌–2ను చివరి గంటలో రాకెట్‌లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపేసిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి.. వారం తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సవరించి ప్రయోగానికి సిద్ధం చేశారు. రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌–2ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.

శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ ప్రయోగం పనులపై అన్ని సెంటర్ల డైరెక్టర్లతో ఎంఆర్‌ఆర్‌ సమావేశాన్ని నిర్వహించారు. షార్‌ శాస్త్రవేత్తలు కల్పనా అతిథి గృహంలో ఈ సమావేశానికి హాజరై సలహాలు, సూచనలను తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఒకసారి లాంగ్‌ రిహార్సల్స్‌ నిర్వహిస్తారు. లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో మరోమారు సమావేశమయ్యాక సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ నిర్వహించే అవకాశం ఉంది.

అయితే.. ఆదివారం ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ షార్‌కు విచ్చేసిన తర్వాత ల్యాబ్‌ మీటింగ్‌ జరుగుతుందని షార్‌ అధికార వర్గాలు అంటున్నాయి. మొత్తానికి 3,850 కిలోల బరువు కలిగిన చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: