అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు...  ఎవరికి వారే మాట్లాడకుండా తప్పించుకోవడానికి కారణాలేంటి అన్న ప్రశ్నలు  తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అంతర్మధనానికి గురిచేసింది.   పార్టీలోని   సీనియర్ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ సమావేశాల్లో  మౌనంగా ఉండడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో   పార్టీలోని  సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఎందుకు మాట్లాడడం లేదని ఆయన వారిని  ప్రశ్నించినట్లు సమాచారం.  దానికి ఒక్కరు ఒక్కొక్క ఎమ్మెల్యే ఓ కారణం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారే ...  తప్పితే అసెంబ్లీలో అధికార పార్టీని  ధీటుగా ఎదుర్కొంటామన్న  సమాధానం వారి నుంచి రాకపోవడం అధినేతని సైతం విస్మయానికి గురి చేసినట్లు  తెలుస్తోంది .


సీనియర్ ఎమ్మెల్యేలు కరణం బలరాం,  పయ్యావుల కేశవ్, వల్లభనేని వంశీమోహన్ , గద్దె రామ్మోహన్  వంటి వారు సభ లో ఇంత రచ్చ జరుగుతున్నా  మౌనం ఉండడం  పార్టీ కేడర్ ను  కూడా ఆందోళనకు గురిచేస్తుంది.  దానికి తోడు  పలువురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారన్న ప్రచారంతో అసలు  పార్టీలో ఏం జరుగుతోందన్న గందరగోళం వారిలో నెలకొంది.  వైకాపా ధీటుగా  కేవలం అచ్చెన్నాయుడు,  గోరంట్ల బుచ్చయ్య చౌదరి,  రామానాయుడు మాత్రమే మాట్లాడుతుండడం ,  మిగతా ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం పరిశీలిస్తే నిజంగానే కొంతమంది ఎమ్మెల్యేలు, బీజేపీ తో టచ్ లో ఉన్నారేమోనని సాధారణ కార్యకర్తలు కూడా   అభిప్రాయ పడుతున్నారు .  అయితే అధికార పార్టీకి తాను ఎక్కడ టార్గెట్ అవుతామన్న భయం తోనే కొంతమంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నట్లు  తెలుస్తుంది.


 ఒకవేళ అసెంబ్లీ లో తమ గళం విప్పి అధికార పార్టీ పై విమర్శలు చేస్తే , ఎక్కడ  తమ వ్యాపారాలను టార్గెట్ చేసి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అభిప్రాయాన్ని పలువురు ఎమ్మెల్యేలు  అధినేత ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం . ఇక ఆదిరెడ్డి భవాని మాట్లాడుతూ  తాను తొలిసారి గెల్చిన ఎమ్మెల్యే కావడం వల్లే మాట్లాడలేకపోతున్నానని ...  నేను మాట్లాడితే ఎక్కడ సీనియర్లు నొచ్చుకుంటారోనన్న వెనుకంజ వేస్తున్నాని చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది .  అధికార పార్టీ నేతలు పదే , పదే  చంద్రబాబును టార్గెట్ చేస్తున్నా , టీడీపీ  ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో , బయట  నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది.  ప్రధానంగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం చూస్తుంటే నిజంగానే వారు బీజేపీతో టచ్ లో ఉన్నారేమోనని అభిప్రాయం సర్వత్రా  వ్యక్తం అవుతోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: