భార‌త్‌పై పాకిస్తాన్ స‌హా తాలీబాన్లు ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో తెలియ‌జెప్పే వాటిలో ఓ ఉదాహ‌ర‌ణ ఇది.  తాలిబన్ నాయకుడి ఆధ్వర్యంలో నడుస్తున్న భారీ హెరాయిన్ రాకెట్ గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టుచేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ మూఠా రూ.5 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను దేశంలోకి సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు.  120 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం ఈ చీకటి వ్యాపారాన్ని వెలుగులోకి తెచ్చామ‌ని వివ‌రించారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఇద్దరు రసాయన నిపుణులతోసహా ఐదుగురు స్మగ్లర్లను తొలుత అరెస్ట్‌ చేసిన పోలీసులు శుక్రవారం మరో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. సరుకును కొనుగోలు చేసిన ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తగా గుర్తించారు. 


భారత్‌, ఆఫ్ఘన్‌ మధ్య సుగంధ ద్రవ్యాల వాణిజ్యాన్ని అంతర్జాతీయ డ్రగ్‌ ముఠా ఎలా ఉపయోగించుకుంటున్నదో ఈ వ్యవహారం బట్టబయలు చేసింది. డ్రగ్స్‌ను కరిగించి, వాటిలో జనపనార తాళ్లను నానబెట్టి, వాటి ద్వారా గోనెసంచులను తయారు చేస్తారని, అనంతరం వాటిల్లో సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్‌ను నింపి కశ్మీర్‌ ద్వారా సరిహద్దు దాటిస్తున్నట్లు పోలీసులు వివరించారు. అనంతరం ఆ సంచులను పోగుపోగులుగా విడదీసి, ఓ రసాయనంలో ముం చుతారని, దాని నుంచి హెరాయిన్‌ను వేరుచేస్తారని తెలిపారు. ఒక్కో బ్యాగు ద్వారా కేజీ హెరాయిన్‌ను పంపుతున్నట్లు పేర్కొన్నారు.


ఢిల్లీ, అమృత్‌సర్‌ మధ్య చక్కర్లు కొడుతున్న ఆరు కార్లతో కూడిన కాన్వాయ్‌పై నిఘా పెట్టిన ఖాకీలు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ‘ఆగ్నేయ ఢిల్లీ జిల్లాలోని పలుప్రాంతాల్లో తరచూ భారీ కాన్వాయ్‌ సంచరిస్తుండడంపై సమాచారం అందడంతో ఈ ఆపరేషన్‌ ప్రారంభించాం. ఈ కాన్వాయ్‌లో విదేశాలకు చెందిన వారిని ప్రత్యేకించి ఆప్ఘనిస్థాన్‌, ఆఫ్రికన్‌ దేశాలకు చెందినవారిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 17న పెద్ద మొత్తం డ్రగ్స్‌ను లాజ్‌పత్‌ నగర్‌లో డెలివరీ చేసే అవకాశం ఉందని మాకు సమాచారమందింది. రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరిని పట్టుకుని 60 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాం. జకీర్‌నగర్‌లోని ఓ ఇంటిలో తనిఖీలు చేసి ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. వారి నుంచి 60 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నాం. వారిచ్చిన సమాచారంతో మరో నిందితుడిని అదుపులోకి తీసుకుని 30 కిలోల హెరాయిన్‌ పట్టుకున్నాం’ అని డీసీపీ మనీశ్‌ చంద్ర తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: