మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌కు ఎందుకు దూరమయ్యారు?
పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించడం లేదు? ఈ పరిణామం నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడే ఆమె ఎందుకు మౌనం దాల్చినట్టు? ఒక వైపు చాపకింద నీరులా బీజేపీ వస్తోంటే, జిల్లా నేతల్లో ఆమె ఎందుకు ధైర్యం నింపడం లేదు ?
ఇవీ టీఆర్‌ఎస్‌ అభిమానులను వెంటాడుతున్న ప్రశ్నల నేపథ్యంలో విశ్లేషణ ఇది..

1, పార్లమెంట్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ కుమార్తె కవిత ఓడిపోవటం టీఆర్‌ఎస్‌కి పెద్ద నష్టమే కలిగించింది. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్‌లో అనర్గళంగా మాట్లాడే కవిత ఓటమి ఒకింత ఆశ్యర్యకరమే...
2, ఆమె ఓటమి ప్రభావం నుంచి నిజామాబాద్‌ జిల్లా పార్టీ నేతలు తేరుకోలేదు.
3, ఫలితాల అనంతరం ఆమె ఒక్కసారి మాత్రమే, జిల్లాకు ఆమె వచ్చివెళ్లారని ఆక్కడి కార్యకర్తలు అంటున్నారు. హైదరాబాద్‌లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో సైతం కనిపించడం లేదు.
4, గతంలో జిల్లాలో అన్నీ తానై పార్టీని ఆమె నడిపించేవారు. పరాజయం తర్వాత జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్దదిక్కు కరువైందనే చెప్పాలి.
5, గతంలో ఆమె ఎంపీగా ఉన్నప్పుడు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ప్రతి నియోజకవర్గంలోనూ రోడ్‌ షోలతో ప్రచారాన్ని ఉరకలెత్తించారు. మంచి ఫలితాలు రాబట్టారు. ప్రస్తుతం ఆమె జిల్లా వైపు చూడకపోవడంతో పార్టీ క్యాడర్‌లో చైతన్యం కొరవడింది.
6, జిల్లా మంత్రిగా ప్రశాంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నా.. మిగతా ఎమ్మెల్యేలు ఆయనకు సహకరించటం లేదన్న విమర్శ ఉంది.
7,టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వం కార్యక్రమానికి కూడా కవిత ఎందుకు దూరంగా ఉన్నారంటూ గులాబీ తమ్ముళ్లు తర్జనభర్జనలు పడుతున్నారు.
8,జిల్లా రాజకీయాలకు కవిత దూరం కావడంతో, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇదే సమయంలో జిల్లాలో బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా వారు దూసుకెళుతున్నారు.

నిజమాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ గెలిచిన ఉత్సాహంలో ఉన్న కమల నాయకులు ఆ పట్టును నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అమిత్‌ షా సూచనలతో, చాపకింద నీరులా క్యాడర్‌ను పెంచుకునేందుకు, ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో జనంలోకి జోరుగా దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దడానికి కల్వకుంట్ల కవిత మళ్లీ యాక్టివ్‌ అవ్వాల్సిన అవసరం ఉందని జిల్లాలోని కేసీఆర్‌ అభిమానులు,పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: