అభివృద్ధి-సంక్షేమం జోడెద్దులుగా త‌మ ప‌రిపాల‌న ఉంటుంద‌ని తెలంగాణ‌ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనేక సంద‌ర్భాల్లో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇతర రాష్ర్టాలకు, దేశానికే సగర్వంగా చూపించుకొనే రీతిలో త‌మ డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఉంటుంద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. అయితే, అనుకున్న రీతిలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జ‌ర‌గ‌లేదు. దీంతో అప‌ఖ్యాతి పాలైంది. అయితే, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొల్లూరులో భారీ కొల్లూరు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేప‌డుతోంది. ఈ ప్రాజెక్టును శ‌ర‌వేగంగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క‌దులుతున్నారు.


సీఎం కేసీఆర్ ఆదేశం మేర‌కు గృహనిర్మాణశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రారామచంద్రన్‌ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి, నిర్మాణ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్టు ఆసియాలోనే అద్భుతమని, సీఎం కేసీఆర్‌ కలలకు ప్రతిరూపం ఈ భారీ గృహనిర్మాణ ప్రాజెక్టు అని చెప్పారు. దాదాపు రూ.1,355 కోట్ల వ్యయంతో, 124 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 17 వేల ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నదని తెలిపారు.  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పూర్తిగా అధునాతన హంగులతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదని, థర్డ్‌ పార్టీ ఎంక్వైరీ ద్వారా పూర్తిగా పారదర్శకంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే నిర్మాణాలు పూర్తికావచ్చే దశకు చేరుకొన్నాయని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంత అద్భుత నిర్మాణాలు, ఇంత త్వరగా జరుగుతాయా? అని ప్రజలు, ఇతర వర్గాలు అశ్చర్యపడుతున్నారని, గొప్ప నిర్మాణాలు అంటూ సంతోషిస్తున్నారని చెప్పారు. ప్రజలు కోరుకొన్నట్టుగా మంచి సౌకర్యాలతో ఇండ్ల నిర్మాణం జరుగుతుండటంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నదని అన్నారు.


కొల్లూరు డబుల్‌ బెడ్‌రూం కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చిత్రారామచంద్రన్‌ తెలిపారు. తాగునీరు, రవాణా, ఫైర్‌, పోలీసు అవుట్‌ పోస్టులు, మెడికల్‌ కళాశాల, పిల్లల పార్కులు ఏర్పాటవుతాయని చెప్పారు. షాపింగ్‌ మాల్స్‌ కూడా ఇక్కడ ఉంటాయని, ప్రతి బిల్డింగ్‌లో వాచ్‌మన్‌ కోసం ప్రత్యేక క్వార్టర్‌ ఉంటుందన్నారు. కాలనీ నిర్మాణ పనులు చూసేందుకు వస్తున్న ఇతర రాష్ర్టాల అధికారులు ఎలా సాధ్యమవుతున్నదంటూ ఆశ్చర్యపోతున్నారని, సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతున్నదని చెప్పామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, గృహనిర్మాణ సంస్థలు సగర్వంగా తలెత్తుకొని చూపించుకొనే ప్రాజెక్టు ఇది అని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా కాలనీ మధ్యలో గ్రంథాలయం ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా డ‌బుల్ ఇండ్ల నిర్మాణం న‌త్త‌న‌డ‌క‌న ఉన్న త‌రుణంలో కొల్లూరు నిర్మాణాల‌తో ఆ అసంతృప్తిని దూరం చేసేందుకు స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌ని...విప‌క్షాలు విమ‌ర్శిస్తుండ‌టం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: