ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఆగష్ట్ 15వ తేదీ నుండి మన రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. గ్రామ/ వార్డ్ వాలంటీర్లకు జులై 11 వ తేదీ నుండి 23 వ తేదీ దాకా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలపై గ్రామ వాలంటీర్లకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుండి చాలా విమర్శలు వస్తున్నాయి. గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు కేవలం వైసీపీకి చెందిన కార్యకర్తలకే ఇస్తున్నారని చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా జరుగుతుందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.  
 
మరి కొన్ని ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు ఎమ్మెల్యే సిఫార్సు ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఇస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యే సిఫార్సు కోసం 5 వేల నుండి 20 వేల దాకా డబ్బులు వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు ముందుగానే అధికారులకు వీరినే ఎంపిక చేయాలని ప్రిపేర్ చేసిన జాబితా ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గ్రామ వాలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు మాత్రం ఈ ఆరోపణలు అబద్దమని ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. 
 
గత ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల ద్వారా పథకాలు అమలు చేసేది. ఈ జన్మభూమి కమిటీలు టీడీపీ పార్టీకి చెందిన వారికి మాత్రమే పథకాలు అమలు చేస్తున్నాయని తటస్థులకు, ఇతర పార్టీలకు చెందిన వారికి పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నాయని విమర్శలు వచ్చాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి జన్మభూమి కమిటీలు కూడా ముఖ్య కారణమే. ఇప్పుడు వైసీపీ కూడా కేవలం వైసీపీ కార్యకర్తలనే గ్రామ వాలంటీర్లుగా నియమిస్తే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: