స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాను మించిన ఉత్కంఠ‌, ట్విస్టుల‌తో కొన‌సాగుతున్న క‌ర్ణాట‌క రాజ‌కీయం మ‌రో మ‌లుపు తిరిగింది. ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. విశ్వాస పరీక్షపై వివాదం కొనసాగుతోంది. నాటకీయ పరిణామాల మధ్య ఈ ఎపిసోడ్ పెండింగ్‌లో ప‌డిపోయింది. అయితే,  బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ ఎపిసోడ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌కు సూచించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కుమార‌స్వామికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.


కుమారస్వామి సర్కార్‌కు ఆఖరి రోజు సోమ‌వార‌మేన‌ని య‌డ్యుర‌ప్ప వ్యాఖ్యానించారు. ``గవర్నర్‌ ఆదేశాలను ముఖ్యమంత్రి కుమారస్వామి పట్టించుకోవట్లేదు. కర్ణాటకలో ఎవరి బలం ఏమిటో సోమవారం తెలుస్తుంది. స్పీకర్‌, సీఎం, సీఎల్పీ నేత రేపటి అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి. రేపే కుమారస్వామి సర్కార్‌కు ఆఖరి రోజు. అన్నింటికీ రేపు అసెంబ్లీలో సమాధానం దొరుకుతుంది. అసెంబ్లీలో నిర్వహించే ఓటింగ్‌ విషయంలో ఎమ్మెల్యేలను బలవంతం చేయొద్దని సుప్రీం కోర్టు పేర్కొంది. రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి ఒత్తిడికి పాల్పడొద్దు. ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు జారీ చేసిన విప్‌కు ఎలాంటి విలువ లేదు. కుమారస్వామి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తోంది` అని విమర్శించారు.


ఇదిలాఉండ‌గా, మరోవైపు నంబర్ గేమ్ సంకీర్ణానికి షాక్‌గా మారుతోంది..! రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలో మకాం వేస్తే.. ఇక ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా చేజారుతుతున్నారు. ఈ నేపథ్యంలో సభకు హాజరయ్యే వారు ఎంత మంది? మేజిక్ ఫిగర్ ఎంత? ప్రభుత్వం నెగ్గాలంటే ఎన్ని సీట్లు ఉండాలి. ఈ లెక్కలన్నీ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. తాజా లెక్కల ప్రకారం కాంగ్రెస్‌కి చెందిన 12 మంది, జేడీఎస్‌కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం 68గా, జేడీఎస్ బలం 34గా ఉంది. బల నిరూపణ సమయంలో అసెంబ్లీలో ఎంత మంది ఉంటారో లెక్కలేసి... దాని ప్రకారం మేజిక్ ఫిగర్‌ని నిర్ణయించే అవకాశం ఉంది. అదే జరిగితే... 15 మంది రెబెల్ సభ్యులు రాకపోతే... సభలో సభ్యుల సంఖ్య 210కి పడిపోతుంది. ఫలితంగా మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. బీజేపీకి ఇద్దరు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. అందువల్ల ఆ పార్టీ బలం 107గా ఉంది. అదే సమయంలో ప్రభుత్వ బలం (68+34) 102తోపాటూ... బీఎస్పీ మద్దతు ఇస్తే 103 అవుతుంది. అయినప్పటికీ మెజార్టీ లేనట్లే. దాంతో కుమారస్వామి సర్కార్ బలపరీక్షకు వెనుకాడుతోందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: