తెలంగాణాలో ప్రస్తుతం ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగానే , మరొక మినీ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు . బెంగళూరు జాతీయ రహదారిపైన నూతన  విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు . ఇప్పటికే శంషాబాద్‌ సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా , రెండోది మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఏర్పాటు చేయనున్నారు. సుమారు 500 ఎకరాల్లో మినీ విమానాశ్రయం రూపుదిద్దుకోబోతోంది.


 ఎయిర్‌పోర్టు సాంకేతిక శాఖ నుంచి అనుమతి రాగానే విమానాశ్రయ ఏర్పాటుకు కావాల్సిన పనులు చకచకా ప్రారంభం కానున్నాయి. భూసేకరణలో భాగంగా జాతీయ రహదారికి ఆనుకొని వందెకరాల భూమిని ప్రభుత్వం  గుర్తించింది . మిగతా స్థలాన్ని స్థానికుల నుంచి సేకరించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఐటీ కారిడార్‌, పోలేపల్లి  పారిశ్రామికవాడలు కూడా ఎన్‌హెచ్‌-44కు అనుసంధానంగానే ఉండటంతో భవిష్యత్తులో పాలమూరు పరిధిలోని హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఈ మేరకు రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖల అధికారులు కసరత్తు ప్రారంభించారు.


ఇప్పటికే సర్వే నంబరు 118లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించినందున త్వరలోనే ఎయిర్‌పోర్టు సాంకేతిక శాఖ అధికారులు గుడిబండకు వచ్చి స్థలాన్ని పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయి పనులను రోడ్లు భవనాల శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. వారు గుడిబండ వద్ద మినీ విమానాశ్రయం ఏర్పాటుపై నివేదిక తయారుచేసి ఎయిర్‌పోర్టు అధికారులకు సమర్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: