హైదరాబాద్‌ నగరంలో, మోతాదుకు మించి మద్యం తాగి సొంతంగా వాహనాలు నడుపుకొంటూ వెళ్తున్న మందుబాబులు డ్రంకన్‌ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కకుండా సరికొత్త రస ప్రయోగాలు చేస్తున్నారు. మద్యం తీసుకున్న తరువాత కొత్తిమీర రసంలో నిమ్మకాయ పిండి, తాగేసి శ్వాస పరీక్షకు దొరక కుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు.
' మద్యం తాగిన వారు కొత్తిమీర రసం తాగినంత మాత్రాన మద్యం మత్తు నుండి బయట పడటం అసాధ్యం. మోతాదుకు మించి మద్యం తాగితే పట్టుబడడం ఖాయం, పాన్‌ వేసుకున్నా, పాన్‌ మసాలా తిన్నా ఉపయోగం ఉండదు...' అని ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్‌ మహేష్‌ అంటున్నారు.

' ఐతే, మద్యం తీసుకోకుండా, రోజూ పరగడుపున కొత్తిమిర రసం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.కండరాల క్షీణత, ఆర్థరైటిస్‌, గుండె జబ్బులతోపాటు అల్జీమర్‌, కొన్నిరకాల క్యాన్సర్లతో కొత్తిమీర జ్యూస్‌ లోని యాంటీ ఆక్సిడెంట్లు పోరాడతాయి. యాంగ్జయిటీని తగ్గించే మందుగానూ కొత్తిమీర రసం ఉపయోగపడుతుంది. ఒంట్లో చక్కెర స్థాయిలను నియత్రించడంలోనూ కొత్తిమీర జ్యూస్‌ ఎంతగానో తోడ్పతుంది. కాలేయ పనితీరు మెరుగుపర్చడంలో కొత్తిమీర రసం తర్వాతే ఏదైనా ...' అని ఆ డాక్టర్‌ అన్నారు.

పోలీసులకు దొరికి పోతున్నారు...
మోతాదుకు మించి మద్యం తాగిన అనంతరం మందుబాబులు హైదరాబాద్‌ రోడ్లమీద కార్లలో దూసుకు పోతూ, పోలీసులకు పట్టుబడకుండా బ్రీత్‌ అనలైజర్‌ను మాయ చేసేందుకు, మద్యం తాగడం పూర్తయ్యాక కొత్తిమీర రసం తాగేస్తున్నారు. ఈ ఎత్తులు కనిపెట్టిన పోలీసులు కొన్న కొత్త బ్రీత్‌ అనలైజర్లు వాడుతూ, వారిని పట్టుకుంటున్నారు. దీంతో వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులకు అప్పగించి ఇళ్లకు వెళ్తున్నారు.

' కొత్తిమిర రసాన్ని తీసుకుని బయటకు వచ్చాక, మద్యం తాగిన వాసన రావడం లేదు.  ఎక్కువగా మద్యం తాగినా తాగినట్టు అనిపించదు. ఇలా చాలా సార్లు తప్పించుకునాను. కానీ ఈ మధ్య కొత్త తరహా బ్రీత్‌ అనలైజర్లు పోలీసులు వాడుతున్నారు. దాంతో శ్వాస పరీక్షలో బుక్‌ అవుతున్నాం...' అని జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు దగ్గర ఒక యువ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అంటున్నారు.

గత నాలుగు నెలల్లో 60శాతం మంది కొత్తిమీర, నిమ్మకాయలను ఉపయోగిస్తున్నారు. చట్ట ప్రకారం మద్యం తాగిన వారి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాముల అల్కాహాల్‌ వరకే అనుమతి ఉంటుంది. 30 మిల్లీగ్రాములు దాటితే... మద్యం తాగిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నిమ్మకాయ రసం తాగినా దొరికి పోతున్నారు అని పోలీసులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: