రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ నాయ‌కుల పంట పండింద‌ని అంటున్నారు పరిశీల‌కులు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వినూత్నంగా ప్రారంభించ‌నున్న 16 కొత్త కార్పొరేష‌న్ల‌లో వైసీపీ నేత‌ల చైర్మ‌న్లుగా స‌భ్యులుగా కూడా కొన‌సాగే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలోఇప్పుడు రాష్ట్రంలోని వైసీపీ నాయ‌కులు పండ‌గ చేసుకుంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రాష్ట్రంలో సామాజిక వ‌ర్గాల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసింది. ఆయా కార్పొరేష‌న్ల‌కు నిధులు మంజూరు చేసింది. అయితే వీటిని బాబు రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఎన్నిక‌ల ముందే ఏర్పాటు చేశారు. 


ముఖ్యంగా కొన్ని సామాజిక వ‌ర్గాలు స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కూడా ఇంకా వెనుక‌బాటులోనే ఉండిపోతున్నాయి. దీంతో వారి అభ్యున్న‌తి అనేది ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. నాయ‌కుల‌పై ఆశ‌ల‌తో వారు నిత్యం ఏదో ఒక డిమాండ్‌ను తెర‌మీదికి తీసుకువ‌స్తున్నారు. అయితే, దీనికి ప‌రిష్కారం మాత్రం ఎక్కడా క‌నిపించ‌డం లేదు. అణ‌గారిన వ‌ర్గాలుగా ఉన్న‌, కేవ‌లం త‌క్కువ జ‌నాభాగా ఉన్న వారు కూడా స‌మాజంలో వివ‌క్ష‌కు గురవుతున్నారు. దీని నుంచి వారిని ర‌క్షించేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌తి సామాజిక వ‌ర్గానికీ ఓ కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించి.. ఆ దిశ‌గా అడుగులు వేసింది. 


ఈ క్ర‌మంలోనే ఆయ‌న హ‌యాంలో కాపు, బ్రాహ్మ‌ణ‌, వైశ్య, మైనార్టీ కార్పొరేష‌న్లు ఏర్పాటు చేశారు.ఆయా కార్పొరేష‌న్ల‌కు భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించారు. అయితే, బాబు హ‌యాంలో అగ్ర‌ వ‌ర్ణాల‌కు మాత్ర‌మే కార్పొరేష‌న్లు ఏర్పాట‌య్యాయ‌నే వాద‌న బ‌లంగా వీచింది. దీనికి విరుగుడుగా.. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాను నిర్వ‌హించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వినూత్న ప్ర‌క‌ట‌న చేశారు. తాను ఆధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అణ‌గారిక ప్ర‌తి సామాజిక వ‌ర్గానికీ.. కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. 


ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న ప్ర‌భుత్వం కొలువుదీరిన 50 రోజుల్లోనే ఆ దిశ‌గా అడుగులు వేయ‌డం ప్రారంభించారు. ప్ర‌స్తుతం బీసీ కార్పొరేష‌న్‌తో పాటు మొత్తం 24 కులాల వారికి ప్ర‌త్యేకంగా కార్పొరేష‌న్లు ఉన్నాయి. ఇక‌, బీసీ వ‌ర్గాల్లోని 32 కులాల‌కు క‌లిసి.. ఎంబీసీ ఉండి. అయితే, ఇప్పుడున్న వాటిలో 16 సామాజిక వ‌ర్గాల‌కు కొత్త‌గా కార్పొరేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి అధికారులు కూడా రంగంలోకి దిగారు. త్వ‌ర‌లోనే వీటి ఏర్పాటు ద్వారా వైసీపీ నాయ‌కుల‌కు భారీ ఎత్తున ప‌ద‌వులు ల‌భించ‌నున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: