చందమామ ఎంతెంతె దూరం. అంటే కంటికి, మింటికీ అన్న సమాధానం వస్తుంది. అయితే ఇపుడు మాత్రం మరో జవాబు చెప్పాలి. మనమే లేట్. ఎంత దగ్గరగా వెళ్తే అంత అందంగా, మరింత సౌందర్యంగా  కనిపించేవాడే చందమామ అని. ఇలను, కలను కలిపేస్తున్నాడని.



విషయానికి వస్తే భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ -2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ రోజు   మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌–2ను ప్రయోగించనున్నారు.


దీనికి సంబంధించి నిన్న   సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభించారు. 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది. 3.8 టన్నుల బరువున్న చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. 


ఇదిలా ఉండగా  ఈ నెల 15వ తేదీ వేకువజామున ప్రయోగించాలనుకున్న చంద్రయాన్‌–2ను చివరి గంటలో రాకెట్‌లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి.. వారం తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సవరించి ప్రయోగానికి సిద్ధం చేశారు.  మొత్తానికి భారతదేశానికి గర్వకారణమైన అద్భుతానికి ఈ రోజు అంకురార్పణ జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: