ఇంటింటా మామిడి తోరణాలు...బంతిపూల దండలు...ఇళ్ల‌ ముందు వెల్‌కమ్ టు సీఎం కేసీఆర్ అంటూ ముగ్గులు.. తమ ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకడానికి సిద్ధమైన చిత్ర‌మిది. ఎక్క‌డ అనుకుంటున్నారా?రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో. ఎందుకు అనుకుంటున్నారా...గ‌త శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వెళ్లిన కేసీఆర్ ఈ సంద‌ర్భంగా చింతమడక గ్రామస్థులతో ``నేను మళ్లీ వస్తా.. అన్ని విషయాలను మాట్లాడుకుందాం.. మీతో రోజంతా గడుపుతా..`` అని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, సొంతూరుకు కేసీఆర్ వెళుతున్నారు. అందుకే.


విభిన్న‌మైన రాజ‌కీయాలు, ప‌రిపాల‌న‌కు సుప‌రిచితులు అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదే ఒర‌వ‌డిలో మ‌రో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. త‌న సొంత ఊరు చింత‌మ‌డ‌క చ‌రిత్ర‌ను మార్చేలా శ్రీ‌మంతుడి అవ‌తారం ఎత్త‌నున్నారు. కేసీఆర్‌తో ఈ గ్రామానికి గుర్తింపు వచ్చింది. చరిత్ర పుటల్లో చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన నేత ఆయన. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ర్టాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ నేడు త‌న సొంతూరుకు రానుండటంతో గ్రామస్థులు మహా సంబురపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 


ఇప్పటికే గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన అధికారులు దాని ప్రకారం ప్రతిపాదనలను రూపొందించారు. మాజీమంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ పీ వెంకట్రామ్‌రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ ఆదివారం గ్రామంలో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించి గ్రామస్థులతో సమావేశమయ్యారు. కేసీఆర్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఉద‌యం  10.30 గంటలకు చింతమడక గ్రామానికి చేరుకుంటారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయడంతోపాటు డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభిస్తారు. గ్రామంలో కలియదిరుగుతారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లుచేశారు. 


ఇది కేవలం సీఎం కేసీఆర్ సొంతూరు గ్రామస్థులతో మమేకమయ్యే పర్యటన అయినందున ఇతరులెవరినీ అనుమతించడం లేదు. ఇందుకోసం 3200 మంది గ్రామస్థులకు ప్రత్యేకంగా తయారుచేయించిన పింక్ కలర్ ఐడీ కార్డులను అందించారు. వీరంతా ఐడీ కార్డులతో సభాస్థలికి చేరుకుంటారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. 200 మంది అధికారులకు వైట్ గుర్తింపుకార్డులు, 200 మంది మీడియా ప్రతినిధులకు గ్రీన్ గుర్తింపుకార్డులను అందించారు. మొత్తంగా ఆరువేల మందికి భోజనాలను ఏర్పాటుచేస్తున్నారు. ఐకేపీ గోదాము వద్ద రెయిన్‌ప్రూఫ్ టెంట్‌ను నెలకొల్పారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా గ్యాలరీలను ఏర్పాటుచేశారు. అధికారులు, మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీ ఉంటుంది. 60 మంది కూర్చొనేలా వేదిక రూ పొందించారు. వేదికకు కుడివైపున గ్రీన్ హౌస్ ను ఏర్పాటుచేశారు. సమావేశం అనంతరం భోజనాలకోసం మహిళలకు, పురుషులకు ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఆత్మీయులతో కలిసి భోజనం చేయడానికి పెద్దమ్మ గుడి పక్కనే రెయిన్‌ప్రూఫ్ టెంట్ వేశారు. పెద్దమ్మ గుడి ముందు చింతచెట్టు వద్ద గద్దెను కూడా నిర్మించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, సీఎం కేసీఆర్ త‌న ఊరిలో అడుగుపెట్ట‌డానికి ముందే...రూ.10 కోట్ల‌ను గ్రామానికి కేటాయించారు. వివిధ ప‌థ‌కాల కింద నిధులు ప్ర‌క‌టించారు. ఇక తాజా స‌మావేశంలో ఆయ‌న ఎన్ని ప్ర‌త్యేకత‌లు న‌మోదు చేస్తారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: