పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో నెల‌కొన్న అనిశ్చితి ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. అనేక ట్విస్టుల మ‌ధ్య‌...నేడు శుభం కార్డు ప‌డే అవ‌కాశం ఉంద‌ని `అంచ‌నా` వేస్తున్నారు రెబల్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలను సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. సీఎంను మార్చుతామని రాయబారం పంపినా రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని వారు స్పష్టం చేశారు. విశ్వాస పరీక్షను ఎదుర్కొంటామని ప్రభుత్వం స్పష్టం చేయగా.. చర్చను ఇక పొడిగించేది లేదని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కుమారస్వామి భవితవ్యం నేడు తేలే అవకాశముంది.

విశ్వాస తీర్మానంపై గురువారం నుంచి చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం కాంగ్రెస్‌, బీజేపీ వేర్వేరుగా శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించాయి. మ‌రోవైపు ముంబైలోని ఓ హోటల్‌లో మకాం వేసిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలు ఆదివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సీఎం కుమారస్వామి ప్రభుత్వానికి సోమవారమే చివరి రోజని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప ఆదివారం మీడియాతో అన్నారు. స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌, సీఎం కుమారస్వామి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య కూడా బలపరీక్షను సోమవారం ఎదుర్కొంటామని చెప్పారని, దీంతో ఈరోజుతో అంతా ముగుస్తుందని తనకు వంద శాతం నమ్మకం ఉన్నదన్నారు. రాజీనామా చేసిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుపై బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పడంతో ఆ పార్టీలు జారీ చేసిన విప్‌కు విలువ లేదన్నారు. 


డబ్బుల కోసం తాము ముంబైకి రాలేదని, కాంగ్రెస్‌-జేడీఎస్‌ వైఖరి పట్ల విసిగిపోయామని, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే ముంబైకి వచ్చినట్లు వెల్లడించారు. సోమవారం అసెంబ్లీకి హాజరుకాబోమన్నారు. సీఎం కుమారస్వామితోపాటు కాంగ్రెస్‌ నేతలు సుప్రీంకోర్టు స్పందనపైనే ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టును వారు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలాగే విప్‌ జారీపైనా స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు మేరకు బలపరీక్షపై నిర్ణయం తీసుకోవాలని అధికార పార్టీ నేత‌లు ప్ర‌యత్నిస్తున్నారు.
ఇదిలాఉండ‌గా, ప్ర‌భుత్వ మ‌నుగ‌డ‌పై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్‌-జేడీఎస్‌కు 117 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది (కాంగ్రెస్‌-13 , జేడీఎస్‌-3) రాజీనామా చేశారు. రామలింగారెడ్డి మాత్రం ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. మిగతా 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక వారు ఓటింగ్‌కు గైర్హాజరైనా.. సంకీర్ణ బలం 101కు పడిపోతుంది. దీంతో సంకీర్ణ స‌ర్కారు మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌వుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: