అంతరిక్షంలో భార‌త‌దేశం త‌న‌ స‌త్తా చాటుకునేందుకు మ‌రికొద్ది గంట‌లే వ్య‌వ‌ధి ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘బాహుబలి’గా పిలిచే చంద్రయాన్‌-2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నెల్లూరు జిల్లా సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని (షార్‌లోని) రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌-2ను ప్రయోగించేందుకు ఇస్రో  ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సాగించిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనున్నది. ఇంతకుముందు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఈ నెల 15వ తేదీ వేకువజామునే చంద్రయాన్‌-2ను ప్రయోగించాలని భావించినా, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యను గుర్తించడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యను సరిచేశామని, ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇస్రో చైర్మన్‌ కే శివన్ చెప్పారు. లాంచింగ్‌ రిహార్సల్స్‌నూ విజయవంతంగా పూర్తిచేసినట్లు చెప్పారు. 


2008లో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్‌-1కు కొనసాగింపుగా రూ.978 కోట్ల వ్యయంతో చంద్రయాన్‌-2 మిషన్‌ను ఇస్రో చేపడుతోంది. చంద్రయాన్‌-2 బరువు సుమారు 3.8 టన్నులు. ఇందులో ఆర్బిటార్‌, ల్యాండర్‌, రోవర్‌ ఉంటాయి. ఇంతకుముందు ఏ దేశమూ చేరని చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇస్రో ల్యాండర్‌, రోవర్‌ను దించబోతుంది. చంద్రయాన్‌లోని ఆర్బిటార్‌ ఏడాది పనిచేస్తుంది. చంద్రుడి ఉపరితలంపై దిగే ల్యాండర్‌ (విక్రమ్‌), రోవర్‌ (ప్రజ్ఞ) 14 రోజులు పనిచేస్తాయి. చంద్రుడి దక్షిణ ద్రువంలో దిగి.. నీరు, హీలి యం-3 జాడను గుర్తించడం చంద్రయాన్‌-2 ప్రధాన లక్ష్యాలు. చంద్రయాన్‌-1 ద్వారా జాబిల్లిపై నీటి జాడలను గుర్తించిన సంగతి తెలిసిందే. 


43.43 మీటర్ల ఎత్తైన జీఎస్‌ఎల్వీ మాక్‌-3 రాకెట్‌.. ప్రయోగించిన 16 నిమిషాల తర్వాత స్పేస్‌ క్రాఫ్ట్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెడుతుందని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ అన్నారు. పైకెగసిన తర్వాత చంద్రయాన్‌-2కు 15 కీలక దశలను చేపట్టాలని, సెప్టెంబర్‌ మొదటి వారంలో ల్యాండర్‌ చంద్రుడిపై దిగే అవకాశం ఉందన్నా రు. ఇంతకుముందెన్నడూ ఏ దేశమూ చేరని చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండర్‌ను మృదువుగా దింపనున్నట్లు చెప్పారు. ప్రయోగించిన 16.20 నిమిషాల తర్వాత జీఎస్‌ఎల్వీ రాకెట్‌ చంద్రయాన్‌-2ను భూమికి 170 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. తదుపరి 48 రోజులు శాస్త్రవేత్తలు వివిధ దశలను నిర్వహించనున్నారు. లాంచింగ్‌ను రీషెడ్యూల్‌ను చేసిన ఇస్రో.. ఎర్త్‌ బౌండ్‌ ఫేజ్‌ను తొలుత నిర్ణయించిన 17 రోజులకు బదులుగా 23 రోజులకు పెంచింది. ఈ ఫేజ్‌ చివరిలో చంద్రయాన్‌-2 కక్ష్యను 1.05 లక్షల కి.మీ.లకు పెంచుతారు. అనంతరం క్రమంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెడుతారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చంద్రుడికి 100 కి.మీ. ఎత్తున వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. పలుమార్లు పరిభ్రమించిన అనంతరం సరైన సమయంలో చంద్రయాన్‌-2 ల్యాండర్‌ను చంద్రుడిపైకి జారవిడుస్తుంది. మిషన్‌లో ఈ దశే అత్యంత సంక్లిష్టమైనది. దీనికి 15 నిమిషాలు సమయం పడుతుంది. సెప్టెంబర్‌ 6-8 మధ్యలో ఈ దశను చేపట్టే అవకాశం ఉంది. 


ఇదిలాఉండ‌గా, చంద్రయాన్‌-2 ప్రయోగం వీక్షించేందుకు సందర్శకుల కోసం భారీ గ్యాలరీ సిద్ధం చేశారు. ప్రయోగ వేదికకు సమీప శబరి గిరిజన కాలనీలో సుమారు 60 ఎకరాల అట వీ భూమిలో దీన్ని నిర్మించారు. సుమారు 5 వేల మంది రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించవచ్చు. ఈ నెల 15న ప్రయోగం వాయిదా పడడంతో రాకెట్‌ లాంచింగ్‌ను చూడాలనుకున్న వారికి నిరాశే మిగిలింది. గతంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారు తమ సీరియల్‌ నంబర్లతో పాసులు తీసుకుని ప్రయోగాన్ని వీక్షించొచ్చని ఇస్రో తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: