సొంత భవనాన్ని స్కూల్‌కి ఇచ్చిన ముఖ్యమంత్రి

చాలా మంది ముఖ్య నాయకులు గ్రామాలను దత్తత తీసుకున్నామని ప్రకటించడం వింటాం… అక్కడేమి జరుగుతుందో కూడా చూస్తున్నాం… అలాంటి హడావడి ఏమీ లేకుండా జరిగిన ఒక సామాజికాభివృద్ది ఇది. 

'' మీతో రోజంతా గడుపుతా.. '' శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ చింతమడక గ్రామస్థులతో అన్న మాటలివి. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం సొంతూరుకు రానుండటంతో గ్రామస్థులు మహా సంబురపడుతున్నారు. దీని కంటే ముందు కొన్ని రోజుల క్రితం మేం ఈ గ్రామంలో అడుగుపెట్టి , ప్రజలతో మాట్లాడాం. అసలు కేసీఆర్‌ ఆ గ్రామానికేమైనా చేశారా అని ఆరా తీయగా గుర్తించిన అంశాలివి...

 మెదక్‌ జిల్లా, సిద్ధిపేట నుండి 20 కిలో మీటర్లు వెళ్తే చింతమడక. అది ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వగ్రామం. ఊర్లోకి వెళ్లే ముందు కేసీఆర్‌ భూములకు సమీపంలో పెండెల్స్‌ పై కూరగాయలు పండిస్తున్న దళిత రైతు మల్లన్నను కలిశాం.” ఫాం హౌస్‌లో కేసీఆర్‌ సాగు చేస్తున్న తీరు చూసినంక మేమెందుకు పంటలు పండించ కూడదని…. నేను నా కుటుంబం ఈ బీడు భూమిని సాగులోకి తెచ్చి కూరగాయలు ఆకు కూరలు పండిస్తున్నాం” అన్నాడు.

తన పంటల గురించి తెలుసుకున్న ఢిల్లీ గ్రామీణాభివృద్ది శాఖ వారు అవార్డు ఇచ్చారని సంతోషంగా చెప్పాడు.

అక్కడి నుండి చింత మడక పంచాయితీ ఆఫీసు దగ్గరకు రాగానే సర్పంచ్‌ లక్ష్మీశేఖర్‌, మరి కొందరు గ్రామస్తులు కనిపించారు. వారు చెప్పిన దాని ప్రకారం…..ఆ గ్రామంలోని రైతులకు సర్కారు నుండి 22 బావులు మంజూరయ్యాయి. పొలాలను లింక్‌ చేస్తూ 15 కిలోమీటర్ల రహదారి వచ్చింది. దీనివల్ల పండిన పంటను సులువుగా మార్కెట్‌కి తరలిస్తున్నారు. 150 మంది రైతుల బీడు భూమికి, 18 ఎకరాల పండ్ల తోటలు అభివృద్దికి సాయం చేశారు. ఎస్సీకాలనీకి సిసి రోడ్డు పడింది. కూరగాయల విత్తనాలకు పెండెల్స్‌కి సబ్సిడీ అందింది.ఇది చాలు ప్రజల ఆహార సమస్య తీరడానికి.

సరే ఇదంతా సర్కారు తరపున ఆ గ్రామానికి జరిగిన మేలు.

మరి తన సొంత ఊరికి ముఖ్యమంత్రి ఏమైనా చేశారా అని వారిని అడిగినపుడు ఎదురుగా ఉన్న సీఎం సొంత ఇంటిని చూపించారు.ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక జాతీయ బ్యాంకు బోర్డు కనిపించింది. రూంలో గోడకు కేసీఆర్‌ తల్లిదంఢ్రుల ఫొటొ ఉంది.బ్యాంకు మేనేజరు సూర్య ప్రకాశ్‌ మాతో కరచాలనం చేసి ఇలా అన్నారు...

” ఇది ఒకపుడు ముఖ్యమంత్రి గారి స్ధలం. దీని పక్కనే ఉన్న పెద్ద భవనం ఆయన ఇల్లు. దానిని ప్రభుత్వ స్కూల్‌ కోసం డొనేట్‌ చేశారు. ఇక్కడ బ్యాంకు పెట్టుకున్నందుకు మేం ఇచ్చే అద్దె కూడా స్కూల్‌కే చెందుతుంది. దానిని వారు పిల్లల చదువుకు ఖర్చు చేస్తారు.ఈ ప్రాంతంలో ఇదే తొలి బ్యాంకు. గ్రామీణాదాయం పెరగడం వల్ల ప్రజలు, రైతుల్లో పొదుపు చేసే శక్తి పెరిగింది. ” అన్నారు.

కేసీర్‌ కుటుంబానికి చెందిన ఇల్లు ఇపుడు స్కూల్‌గా మారింది. ఏడు గదులున్న ఈ భవనంలో 153 మంది పిల్లలు చదువుకుంటున్నారు.వారికి విశాలమైన ఆట స్ధలం కూడా ఉంది.తెలంగాణలో పేదోడి బతుకుని మార్చాలని తపిస్తున్న కేసీఆర్‌స్వగ్రామం లోని వెలుగు బాట ఇది. (Ground report from Chintamadaka/Shyammohan)



మరింత సమాచారం తెలుసుకోండి: