కర్ణాటక రాజకీయం మీద ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకు చిరాకు తెప్పిస్తుంది. ఎన్నిరోజులు ఇలా అధికార, ప్రతిపక్షాలు రచ్చచేస్తాయి.. ఏదో ఒకటి తేల్చకుండా ఏమిటిదంతా? అని అక్కడి సామాన్యులు విసిగెత్తిపోయారు. కర్ణాటక అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ తరహా రచ్చే కొనసాగుతూ ఉంది. ముందుగా యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, బలపరీక్షలో ఆయన ఫెయిల్ కావడం, ఆ తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ లు చేతులు కలపడం, కుమారస్వామి సీఎం అయిన దగ్గర నుంచి ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులా కొనసాగుతూ ఉండటం జరుగుతోంది.


సంకీర్ణ సర్కారును ఎమ్మెల్యేలు పలుసార్లు  బెదిరిస్తూనే ఉన్నారు. ఇక ప్రభుత్వం పడిపోతుందని అంటూ బీజేపీ నేతలూ ప్రకటనలు చేస్తూనే వచ్చారు. గత పక్షంరోజుల్లో ఈ రచ్చ పీక్స్ కు చేరింది. ఎమ్మెల్యేల రాజీనామాలు, వాటిని స్పీకర్ ఆమోదించకపోవడం... ఆ తర్వాత జరుగుతున్న రచ్చ అంతా తెలిసిందే! ఈ కథకు సోమవారం క్లైమాక్స్.. అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. బీజేపీవాళ్లు మాత్రం సోమవారంతో ప్రభుత్వం పడిపోవడం ఖాయమని అంటున్నారు.


అయితే రోజుల వారీగా అయినా అధికారాన్ని నిలబెట్టుకుని, ఎలాగోలా కుదురుకోవాలని కాంగ్రెస్-జేడీఎస్ వాళ్లు అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉన్నారు. ఇదంతా చూసి ఇరుపార్టీల అభిమానులు కూడా విసిగెత్తిపోయారు. ఏదో ఒకటి తేల్చండ్రాబాబూ.. అంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అస్పష్ట తీర్పును ఇచ్చిన కన్నడీగులకు అప్పుడే అయిపోలేదు. ఇప్పటికిప్పుడు మళ్లీ యడ్యూరప్ప సీఎం అయినా.. ఆ తర్వాత కూడా ఇలాంటి తంతు ఒకటి కొనసాగడం అయితే ఖాయమని పరిశీలకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: