ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కనీ వినీ ఎరుగని రీతిలో 175 స్థానాలకు 151 స్థానాలు గెల్చుకొని రికార్డు సృష్టించింది.  అయితే అధికార పార్టీ టీడీపీ చేసిన తప్పిదాలే వైసీపీకి అఖండ విజయానికి కారణం అని వైసీపీ నేతలు అంటున్నారు. ఏపిలో వైసీపీ పాలనలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాదు ప్రజలు మెచ్చే విధంగా పాలన కొనసాగిస్తున్నారు.  వైసీపీ ప్రభుత్వం వచ్చి కొద్ది రోజులే అయినా ప్రజలకు ఇచ్చిన నవరత్నాల అమలు కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు.  అయితే ఏపిలో పరిస్థితి ఇలా ఉంటే దేశంలో ప్రస్తుతం బీజేపీ పాలన కొనసాగిస్తుంది.


మోడీ చేసిన మంచి పనుల వల్లే ఆయనను రెండోసారి ప్రధాని పీఠం వరించిందని వారి వాదన.  అయితే ఇప్పుడు దేశంలో..ఏపిలో రాజకీయ పరిణామల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.  కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీ ల నుంచి బీజేపీలోకి వలసలు వెళ్తున్నారు.   భవిష్యత్ లో ఈ వలసలు మరిన్ని ఉండబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.  ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో విజయవాడ, శ్రీకాకుళం, గుంటూరు ఎంపిలు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయ దేవ్‌  హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బేటి అయ్యారు.


నిరంతరం ప్రజలకు చేరువగా ఉంటూ వైఎస్ జగన్  సర్కార్ చేస్తున్న తప్పులను ఎత్తిచూపాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు.  పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.  టీడీపీని వీడీ కొందరు ప్రజా ప్రతినిధులు, నేతలు బీజేపీలో చేరుతున్న విషయాన్ని ఎంపీలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. పార్టీని వీడే వారు వీడుతుంటారు, పార్టీలో కొత్తవారిని చేర్చుకొని పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందని అన్నారు.


ఎపికి ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వకుండా వెనక్కిపోవడం, కేంద్ర పెద్దల్లో వైసిపి పట్ల ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోందనే విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో స్వంత నియోజకవర్గాలకే పరిమితం కాకుండా గుంటూరు పార్టీ కార్యాలయంలో కూడ అందుబాటులో ఉండాలని చంద్రబాబునాయుడు ఎంపీలను ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: