ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు అటవీ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పోడు భూముల్లోకి వచ్చే అటవీ అధికారులను తరిమికొట్టాలని ఆయన పిలుపునివ్వడం చర్చానీయాంశమైంది. ఇటీవల ఉట్నూర్‌ మండలం మత్తడిగూడలో నిర్వహించిన గిరిజన నేత సిడాం శంబు మొదటి వర్థంతి సభలో పాల్గొన్న అయన అటవీశాఖ అధికారులు గిరిజనుల బతుకులను నాశనం  చేస్తున్నారని ఫైరయ్యారు. హరితహారం పేరు చెప్పి గిరిపుత్రుల భూముల్లోకి చొరబడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.


 పోడు భూముల్లోకి అడుగు పెట్టే  ఇచ్చే అధికారులను కట్టెలతో కొట్టండని పిలుపునిచ్చారు. అంతేకాదు పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకి అవతల పారేయండని సూచించారు. కాగజ్ నగర్ సార్సలాలో మహిళా ఎ‌ఫ్‌ఆర్‌వో అనితపై దాడి ఘటన మరచిపోకముందే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే . అదే క్రమంలో తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపికయ్యాయి.కాగజ్ నగర్ సార్సలాలో సాక్షాత్తు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు, జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణ మహిళా అధికారిణిపై దాడి చేయడం దుమారం రేపింది. ఈ ఘటన  జరిగిన కొద్దిరోజులకే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్థానికులను రెచ్చగొట్టేలా.. అటవీ అధికారులొస్తే తరిమికొట్టండని పేర్కొనడం పై దుమారం రేగుతోంది .


 ఇక వనమా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజుల వ్యవధిలోనే  పోడు భూముల్లోకి ఎవరైనా అధికారులొస్తే కట్టెలతో దాడి చేయండంటూ ఎంపీ సోయం మాట్లాడిన తీరు వివాదస్పదమవుతోంది. సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలపై అటవీశాఖ అధికారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు . ఒక ఎంపీ ఈ తరహా వ్యాఖ్యలు చేసి , ప్రజలను రెచ్చగొట్టడం ఏమిటని మండిపడుతున్నారు . అటవీశాఖ అధికారులపై తిరగబడండని ప్రజాప్రతినిధులే  గిరిజనులకు పిలుపునివ్వడం ఇటీవల ఫ్యాషన్ గా మారిపోయింది . అమాయక గిరిజనులను ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టడం వెనుక వేరే మతలబు ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి . ఎమ్మెల్యే , ఎంపీ లు గిరిజనులను రెచ్చగొట్టి పోడు భూముల్లోకి అటవీశాఖ అధికారులు అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని పిలుపునివ్వడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది .

 


మరింత సమాచారం తెలుసుకోండి: