ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాదో ప్రత్యేక స్థానం. ఇక్కడి జనం కాస్త తేడాగా ఉంటారని గుంటూరు వాసులే చెబుతున్నారు. కాస్త పొగరుగా, గీరగా తమదైన శైలితో ఉంటారంటూ గుంటూరు వాసి ఇండస్ మార్టిన్ రాసిన ఫేస్ బుక్ పోస్టు ఆద్యంతం ఆసక్తిరంగా ఉంది. మీరూ చదవండి..


" మా గుంటూరు ఒక వూరు కాదు, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అస్థిత్వం అని నా అనుమానం. ఇక్కడ పుట్టిన మనుషులు ఎవడికి వాడు చాలా బడాయిగా సహజంగా ఇండియా మొత్తాన్నీ ఏలేస్తాం అని ఫీల్ అవుతారు కానీ నిజానికి అలా వాళ్ల చేత మాట్లాడించేది గుంటూరే అని నా ప్రఘాఢ న్నమ్మక్కం. గుంటూరు తన అస్థిత్వాన్ని కలకాలం కాపాడుకునే ఏర్పాట్లలో భాగంగా ఆ గడ్డన పుట్టిన ప్రతీ మనిషీ, కుక్కా, బర్రె, ఆటో, సిటీ బస్సులో తనదైన ఒక రెటమతాన్ని నింపుతుంది. దాని ప్రభావంగా పైన చెప్పిన గుంటూరు కణాలన్నీ పైత్యంగా, మిడిసిపాటుగా... ఇలాంటి లక్షణాలన్నీ కలిపి అదొక రకమైన గీర ప్రవర్తనతో ఎల్లప్పుడూ కకావికలంగా ప్రవర్తిస్తూ ఉంటాయి.


ఈ ప్రవర్తనకు విధ్య, ఐశ్వర్యం, ఎన్నారై హోదా ఏదీ మినహాయింపును ఇవ్వలేదు. కోబాల్డ్ పేట మూడో లైన్లో రేకుల షెడ్డులో ఉండే ఆటో ఏడుకొండలూ, వాషింగ్టన్ డీసీ లో ఉండే తాతినేని శ్రీనివాసరావు ఉర్ఫ్ మిష్టర్ తాతినేని.. ఇద్దరూ ఎవరెవరి పరిధిలో వాళ్ళు తమలో గుంటూరును బ్రతికిస్తూనే ఉంటారు.


ఇది కూడా కాకుండా గుంటూరు మా స్కూలు గోడ నెర్రిలో మొలిచిన రావి చెట్టు వంటిది అని కూడా నా నమ్మకం. తన వేళ్ళను మెల్లమెల్లగా గోడ లోతుల్లోకి దించుతూ ఒక నిర్ణీత పధకం ప్రకారం ఒక నాటికి మా స్కూలును కూలగొట్టి ఇప్పుడు అదే ప్రదేశాన్ని రాగి చెట్టు సెంటర్ గా పిలిపించుకుంటున్న వలసవాదం మా గుంటూరుకు మొదటి నుండీ ఉందనీ, దీనికీ బ్రిటీషు వాళ్ళకూ ఏ సంబంధం లేదనీ కూడా నేను చతుర్కరణ శుద్దిగా నమ్ముతున్నాను (గుంటూరి జనాలకు మనసు, వాక్కు, కర్మ అనే త్రికరణాలకు అధనంగా గీర అనే మరొక కరణం ఉండి వుండవచ్చని కూడా ప్రజలు గుసగుసలాడుకుంటున్న దరిమెలా ఈ పదం వాడటం జరిగింది. ఇది నిజమేనని చదువరులు వ్యాసం పూర్తయ్యే లోపు గ్రహిస్తారనే సత్యాన్ని కూడా నేను ఎరుగినవాడను) గుంటూరు మనిషి ఎక్కడున్నా తన చుట్టు పక్కల ఉన్నా వ్యక్తుల్నీ, వ్యవస్థనూ మెల్లమెల్లగా ఆక్రమిస్తూ ఒకనాటికి వాటి అస్థిత్వ స్థానంలో గుంటూరు తనాన్ని నింపేస్తాడు అని దీని భావన. ఆ కారణంగానే ఎమేరికాలో ఉండే తెలుగు సంఘాలు కూడా ఫక్తు గుంటూరుతనంతో ప్రవర్తించడం మనం చూడవచ్చు.


ఏం.. ఎమేరికాలో ఉన్నాయి కదా... అక్కడి ఆలోచనా విధానంతో .. పరిపాలనా వ్యవస్థతో ఈ సంఘాలు ప్రవర్తించవచ్చు కదా అని మీరు అడగవచ్చు. నా సమాధానం ఒక్కటే..... ఎచ్చట గుంటూరు మనిషి ఉండునో అచ్చట గుంటూరిజమే సాధారణ ప్రవర్తనా శైలిగా చెలామణీ అయిపోవును. ఈ రకమైన మార్పు గుంటూరు ఆటోలకూ కలదని కూడా మనం ఒకడుగు ముదుకూ, పక్కకూ వేసి తీర్మానించేసుకోవచ్చు. అవి నడి రోడ్డులో నిలబడి సైడు తీసుకుని వెళ్ళండి అన్నట్టు చెయ్యి చాపి వేళ్ళను ముడుస్తూ తెరుస్తూ ఐదు సఖ్యను వేళ్ళతో చూపిస్తూ నిన్ను నిర్దేశిస్తాయి. నువ్వే రోడ్డు పక్కన ఆపుకోవచ్చు కదా అని అడిగే తెలివీ ధైర్యం ఎవడికీ ఉండవు. ఆసలు ఆ స్పృహే లేకుండా మిగతా వాహనాలన్నీ సిన్సియర్గా పక్కనుండి దారి చేసుకుని వెళ్ళిపోతాయి. ఇవాళ్ళ హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ప్రవర్తన పెచ్చు పెరగడానికి గుంటూరు నుండి వచ్చి సెటిల్ అయిన కూకట్పల్లి ఆటోలే కారణం అనే విషయం మీలో చాలా మందికి తెలియదు. హైదరాబాదుకు ఇప్పుడు గుంటూరు చేసింది (జలుబు చేసింది, వాతాం చేసింది.. అలాంటి ప్రయోగం అన్నమాట... సెబాస్).


అసలు గుంటూరు ప్రాచీన నామమైన గర్తపురి అనే పదం నుండే గర్తర- గత్తర అనే పదాలు కూడా వచ్చాయని నాలో మరొక వాదన ఉన్నా, అది మరీ మూఢనమ్మకంగా చదువరులు అర్ధం చేసుకుంటారో ఏమో అని కించిత్ అనుమానం కూడా నాలో లేకపోలేదు అన్న మాట నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: