దేశంలోనే రెండో పొడవైన తీర ప్రాంతం ...  పురాతన కట్టడాలు... ప్రసిద్ధి చెందిన  ఆలయాలు ఇతర పర్యాటక స్థలాలు ఆంధ్ర ప్రదేశ్ లో  అందుబాటులో ఉన్నాయి .  వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే పర్యాటక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించిన పాలకులు యోచిస్తున్నారు .  ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక రంగానికి ఉన్న విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకుని ఆదాయ వనరుగా మలచుకోవాలని  జగన్ సర్కారు భావిస్తోంది. రాష్ట్ర  పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఓ   బ్రాండ్ అంబాసిడర్ నియమించాలని  నిర్ణయించింది.  బ్రాండ్ అంబాసిడర్ ల కోసం  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, షట్లర్  పీవీ సింధు ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


 మంత్రి కొడాలి నాని ,  ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావులు  ఇద్దరు  ఎన్టీఆర్ పేరును పరిశీలించవలసిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని  కోరినట్లు  సమాచారం.  అదే సమయంలో అంతర్జాతీయ టోర్నీల్లో  ఘన విజయాలను సాధిస్తున్న పీవీ సింధు పేరును  కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు  ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి . ఎన్టీఆర్ ను పర్యాటక  ప్రచారక బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే బాగా కలిసొస్తుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్ ,  ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు  పట్టించుకోక పోవడంతో ఆయన మిన్నకుండి పోయారు. ఇటీవల  జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్  సోదరి సుహాసిని కూకట్ పల్లి  నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ,  ప్రచారం చేయకుండా కేవలం తన సోదరికి ఓటేయాలని మాత్రమే ఎన్టీఆర్ అభ్యర్థించిన విషయం తెలిసింది .


 దానికి తోడు ఆయన మామ నార్నే శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు వైకాపా లో  చేరడంతో, పర్యాటక ప్రచారక అంబాసిడర్ గా   ఎన్టీఆర్ ను నియమించడం ఖాయమన్న  వాదనలు వినిపిస్తున్నాయి.  అలాగే అంతర్జాతీయ వేదికలపై ఘన విజయాలు నమోదు చేసుకుంటున్న పివి సింధు ని కూడా పర్యాటక ప్రచారం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: