గడచిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో 18స్థానాల్లో గెలిచి మంచి ఊపుమీదున్న కమలం పార్టీ, ఇప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ముఖ్యంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఓపెన్ ఆఫర్లను ప్రకటిస్తుంది. రెండు కోట్ల నగదుతోపాటు పెట్రోల్ బంకుల ఆఫర్ తో తమ నాయకులను ప్రలోభాలకు గురిచేస్తోందని, వాటికి లొంగని నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా భయపెడుతోందని , స్వయానా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

లోకసభ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ,ఈవీఎంలు,సీఆర్పీఫ్ బలగాల సహకారంతో రాష్ట్రప్రజలను మోసంచేసి గెలిచిన బీజేపీ, రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్దతిలో జరిపిస్తే వారి బలమెంతో ఆ పార్టీ పెద్దలకు బహిర్గతం అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉండగా బీజేపీ మాత్రం మమత ఆరోపణలను ఖండిస్తూనే సంస్థాగతంగా బలపడేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అయితే ప్రలోభాల పర్వాన్ని బెంగాల్ వరకే పరిమితం చేయని బీజేపీ, దేశవ్యాప్తంగా "ఆపరేషన్ కమలం" ను ఇదివరకే ఆచరణలో ఉంచింది. మొన్న గోవా, నేడు కర్ణాటక.. ఇలా అన్ని బీజేపీ ప్రభుత్వేతర రాష్ట్రాల్లో తమ పార్టీని తిరుగులేని శక్తిగా అవతరింపజేయాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తుంది. కర్నాటకానికి నేడో రేపో తెరపడితే తమ తదుపరి లక్ష్యం హిందీ రాష్ట్రమైన "రాజస్థాన్" అని కొందరు బీజేపీ పెద్దలు బహిరంగానే వ్యాఖ్యానించారు.

ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణల్లో సైతం తాము అనుసరించాల్సిన వ్యూహాలను ఇదివరకే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రాజ్యసభలో కూడా తమ బలాన్ని పెంచుకొని "జమిలి ఎన్నికల" బిల్లును ఆమోదింపజేసుకోవాలని యోచిస్తున్న బీజేపీ ఆదిశగా పావులు కదుపుతోంది. తామ ప్రణాళికలన్నీ సఫలం అయితే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ,దేశవ్యాప్తంగా తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: