తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా మ‌రోమారు నిర‌స‌న బ‌ట ప‌ట్ట‌నున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప‌థ‌కంపై తీవ్ర నిర‌స‌న తెలిపేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. దాదాపు రూ.5 కోట్ల ఖ‌ర్చుతో కేసీఆర్ త‌లపెట్టిన కొత్త సెక్ర‌టేరియ‌ట్‌, స‌చివాల‌యం నిర్మాణంపై భ‌గ్గుమంటున్న విప‌క్షాలు ఈ మేర‌కు తాజాగా ఆందోళ‌న బాట ప‌ట్టాయి. మాజీ ఎంపీ వివేక్ సార‌థ్యంలోని జి. వెంకటస్వామి ఫౌండేషన్ నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ‘సెక్రటేరియట్ కూల్చివేత – కొత్త అసెంబ్లీ నిర్మాణం’పై నాయకులు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. వివేక్‌తో పాటుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, టీజేఎస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు, ఇతరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చ‌లో సెక్ర‌టేరియ‌ట్ నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. 


తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ, అట్టహాసం కోసం కొత్త సెక్రటేరియట్ కడుతున్నారని విమర్శించారు. సెక్రటేరియట్ ఎందుకు కూల్చుతున్నారో ప్రభుత్వం హేతుబద్ధమైన కారణం చెప్పడం లేదన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. రాష్ట్రం ఆర్ధిక సమస్యలలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఉద్యోగాల భర్తీ, పథకాలకు కూడా నిధులు లేవన్నారు. “రాష్ట్రంలో చాలా మందికి రుణమాఫీ అమలు కాలేదు. బీమా అమలు కాలేదు. పెన్షన్ లు వస్తే బ్యాంక్ వాళ్ళు ఆపుకుంటున్నారు” ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోదండరాం డిమాండ్ చేశారు. జులై 25వ తేదీన చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


రాష్ట్రంలోనే కాదు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎక్కడకు పోయినా సెక్రటేరియట్ కూల్చివేత మీదనే చర్చ జరుగుతోందని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు సెక్రటేరియట్ కట్టుకోవచ్చు కానీ.. బాగా నడుస్తున్న సెక్రటేరియట్ బిల్డింగులను కూల్చి మళ్ళీ కొత్తవి కట్టడం ఎందుకని ప్రశ్నించారు. సెక్రటేరియట్ కూల్చివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని  వివేక్  డిమాండ్ చేశారు. కొత్తవి కట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు లెటర్ ఇచ్చామన్నారు. సెక్రటేరియట్ కూల్చవద్దని కోర్ట్ లోకూడా చాలా మంది పిటిషన్లు వేస్తున్నారనీ.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు. ఈనెల 25వ తేదీన చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నామన్నారు. చలో సెక్రటేరియట్ లో నిరసన కార్యక్రమంలో అన్ని పార్టీలు,కుల సంఘాలు, యువత పాల్గొనాలని వివేక్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణపై రూ.లక్ష 65వేల కోట్ల అప్పు ఉందని పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా చెప్పారన్నారు వివేక్ వెంకటస్వామి. అప్పు చేసి కొత్తవి కట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అప్పులపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: