త‌నదైన శైలిలో విభిన్న‌మైన నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్న వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ క్ర‌మంలో మ‌రో నిర్ణ‌యాన్ని అమ‌ల్లో పెట్టారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ఇకపై సన్నబియ్యం సరఫరా చేయమని అధికారుల్ని సీఎం జ‌గ‌న్‌ ఆదేశించడం...తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ఇప్పటికే ప్రకటించ‌డం తెలిసిందే.  ఇందులో భాగంగా ఏపీలో ఇంటికే రేషన్ పంపేవిధంగా చర్యలు చేపట్టారు. ఈ క్ర‌మంలో ఇందుకు సంబంధించిన సంచుల న‌మూనాలు వెలువ‌డ్డాయి.

 

పేద ప్ర‌జ‌ల క‌డుపు నింపేందుకు ఉద్దేశించిన రేష‌న్ బియ్యం పంపిణీ ఆలోచ‌న‌ల‌కు అమ‌లుకు మ‌ధ్య ఎంతో వ్య‌త్యాసం ఉన్న సంగ‌తి తెలిసిందే. రేషన్‌షాపుల ద్వారా ఇస్తోన్న బియ్యం తినడానికి  ప‌నికివ‌చ్చే రీతిలో లేవ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. దీంతో ఆ బియ్యం రీసైక్లింగ్‌కు పంపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో, సెప్టెంబర్‌ 1 నుంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేసేందుకు వైఎస్ జ‌గ‌న్ సార‌థ్యంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 5,10,20 కేజీల బస్తాల్లో సన్నబియ్యాన్ని ఇకపై లబ్ధిదారుల ఇంటికి నేరుగా సరఫరా చేయనున్నారు. తాజాగా సన్నబియ్యానికి సంబంధించిన సంచుల నమూనాలు సిద్ధం అయ్యాయి. ఈ సంచులపై ముఖ్యమంత్రి జగన్, చిరునవ్వులు చిందిస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోల్ని ముద్రించారు. మంత్రి కొడాలి నాని ఫొటో సైతం ఇందులో పొందుప‌ర్చారు.

కాగా, ఈ సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వంపై రూ.1000 కోట్లు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అర్హుల‌కు క‌డుపునిండా అన్నంతినేలా ఈ భారాన్ని భ‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: