తెలంగాణలో బ‌లోపేతంపై దృష్టిపెట్టిన‌ బీజేపీ ఈ క్ర‌మంలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ జోరు పెంచుతోంది. మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయవేత్త అయిన‌ గడ్డం వివేక్ క‌మ‌లం గూటికి చేరుకోనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కొన్ని రోజులుగా బీజేపీ జాతీయ స్థాయి నేతలతో టచ్‌లో ఉన్న వివేక్ పార్టీలో చేరేందుకు సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఆయన రేపు పార్టీ అధినేత అమిత్‌షా సమక్షంలో కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. 


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన గ‌డ్డం వెంక‌ట‌స్వామి, కాకా వెంకటస్వామి తనయులైన వివేక్, వినోద్ ఇటీవలి జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ఎస్‌లో టికెట్ సమస్యలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో వినోద్ టీఆర్ఎస్‌ నుంచి టికెట్ రాకపోవడంతో, బీఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.  అయితే, స్థానిక ఎమ్మెల్యేలు, నేతల వ్యతిరేకత నెపంతో వివేక్‌కు 2019 ఎన్నికల పోరులో ఎంపీ టికెట్ కేసీఆర్ నిరాకరించారు. ఎన్నిక‌ల నామినేష‌న్ ముందు వ‌రకు వివేక్ పెద్ద‌ప‌ల్లిలో పోటీచేసేందుకు బీజేపీ,కాంగ్రెస్ నాయ‌కుల‌తో మంత‌నాలు జ‌రుపుతూనే వ‌చ్చారు. బీజేపీ అదిష్టానం పెద్ద‌ప‌ల్లి టికెట్ అవ‌కాశం చివ‌రి నిమిషం వ‌ర‌కు ఇచ్చిన‌ప్ప‌టికీ వివేక్ బీజేపీ విష‌యంలో పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌ప‌ర్చ‌లేదు. చివ‌ర‌కు ఇండిపెండెంట్ గా పోటీచేద్దామ‌ని భావించిన‌ప్ప‌టికీ స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌టంతో ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల‌కు ఇచ్చే గుర్తు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌లేద‌ని భావించి ఎన్నిక‌లకు దూరంగా ఉన్నారు.


అయితే, కాక అభిమానులు ఏదైనా పార్టీలో చేరాల‌నే ఒత్తిడి చేసిన నేప‌థ్యంలో...వివేక్ బీజేపీ వైపు మొగ్గు చూపిన‌ట్లు స‌మాచారం. ద‌ళిత సామాజిక‌వ‌ర్గంలో రాష్ట్రంలోనే అత్యంత ధ‌న‌వంతుల్లో ఒక‌రిగా ఉన్న వివేక్ ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల అధిప‌తి కూడా. ఆయ‌న చేరిక బీజేపీకి ఖ‌చ్చితంగా బ‌లం చేకూర్చేద‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: