అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రోమారు భార‌త్‌పై క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది. ఏకంగా దేశానికి సంబంధించిన కీల‌క అంశంపై అప‌హాస్యం చేసేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. పాక్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్‌హౌస్‌లో సోమవారం ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. `మధ్యవర్తిత్వం వహించడాన్ని నేను ప్రేమిస్తా.. ఒకవేళ అవసరమైతే క‌శ్మీర్ స‌మ‌స్య‌పై నేను సాయపడుతా` అని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇమ్రాన్ స్వాగతించారు. కానీ భారత్ మాత్రం తృతీయ పక్షం జోక్యానికి తావు లేదని స్పష్టం చేస్తున్నది. అయితే.. కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ట్రంప్‌ను భారత్ ప్రధాని మోదీ జీ20 స‌ద‌స్సులో స్వయంగా కోరినట్లు ప్రచారం జ‌రుగుతోంది. ఈ వ్యాఖ్య‌ల‌ను భార‌త్ ఖండించింది. 


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్ల నేప‌థ్యంలో భార‌త్ ఘాటుగా స్పందించారు. క‌శ్మీర్ స‌మ‌స్య‌పై మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హింంచాల‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ను ప్ర‌ధాని మోదీ ఎటువంటి విజ్ఞాప‌న‌లు చేయ‌లేద‌ని విదేశాంగ శాఖ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. విదేశాంగ కార్య‌ద‌ర్శి రావీష్ కుమార్ ట్వీట్ చేస్తూ భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉన్న ఎటువంటి స‌మ‌స్య‌లైనా ద్వైపాక్షికంగానే ప‌రిష్కారం కావాల‌న్నారు. సీమాంత‌ర ఉగ్ర‌వాదం నిలిపివేస్తేనే.. పాక్‌తో సంప్ర‌దింపులు సాధ్య‌మ‌న్నారు. రెండు దేశాల మ‌ధ్య గ‌తంలో కుదిరిన సిమ్లా, లాహోర్ అగ్రిమెంట్ ప్ర‌కార‌మే ముందుకు వెళ్లాల‌ని రావిశ్ కుమార్ తెలిపారు. భార‌త్ ట్రంప్ కామెంట్లు కొట్టిపారేసిన నేప‌థ్యంలో దీంతో అమెరికా దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది.


సౌత్ అండ్ సెంట్ర‌ల్ ఏషియా అఫైర్స్ యాక్టింగ్ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ అలిస్ వెల్స్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో కశ్మీర్ అంశంపై స్పందించారు. క‌శ్మీర్ స‌మ‌స్య‌ల‌పై ఆ రెండు దేశాలే చ‌ర్చించాల‌న్నారు. కావాలంటే తాము స‌హ‌క‌రిస్తామ‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  క‌శ్మీర్ స‌మ‌స్య ద్వైపాక్షిక అంశమ‌ని, అది భార‌త్‌, పాక్ మ‌ధ్య పరిష్కారం అయ్యే అంశ‌మ‌ని పేర్కొన్నారు. క‌శ్మీర్ గురించి చర్చించేందుకు రెండు దేశాలు ఆస‌క్తి చూపితే దాన్ని ఆహ్వానిస్తామ‌ని తెలిపారు.


ఇదిలాఉండ‌గా, ఈ కామెంట్లు లోక్‌స‌భ‌లో క‌ల‌క‌లం సృష్టించాయి. మాజీ విదేశాంగ మంత్రి ఎస్ థ‌రూర్ కూడా స్పందించారు. తానేమీ మాట్లాడుతున్నాడో ట్రంప్‌కు తెలియ‌ద‌ని, బ‌హుశా ఆయ‌న‌కి స‌మ‌స్య అర్థం కాలేద‌నుకుంటే, లేదా ఆయ‌నకు స‌రిగా ఎవ‌రూ చెప్ప‌లేద‌నుకుంట‌న‌న్నారు. క‌శ్మీర్ స‌మ‌స్య‌పై మ‌ధ్య‌వ‌ర్తి వ‌ద్దు అన్న విష‌యం మ‌న విధానం అని, మ‌ధ్య‌వ‌ర్తి కోసం మోదీ మ‌రొక‌ర్ని ఆశ్ర‌యించ‌డం అసంభ‌వ‌మే అన్నారు. ఒక‌వేళ పాక్‌తో మాట్లాడాల‌ని అనుకుంటే, నేరుగా మాట్లాడాల‌ని శ‌శిథ‌రూర్ అన్నారు. లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ మాట్లాడుతూ.. అమెరికా ముందు భార‌త్ దాసోహం అయ్యింద‌న్నారు. మ‌నం బ‌ల‌హీనులం కాదు, దీనిపై ప్ర‌ధాని వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అధిర్ డిమాండ్ చేశారు. అయితే జీరో అవ‌ర్‌లో దీని గురించి చ‌ర్చిద్దామ‌ని స్పీక‌ర్ అన్నారు. విదేశాంగ మంత్రిత్వ‌శాఖ దీనిపై ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హార‌ల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు. క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి వ‌ర‌కు తీసుకు వెళ్లింది ఎవ‌రో తెలుసు అని ఆయ‌న ప‌రోక్షంగా మాజీ ప్ర‌ధాని నెహ్రూపై ఆరోప‌ణ‌లు చేశారు. ఇది సీరియ‌స్ అంశ‌మ‌ని, ఇందులో రాజ‌కీయాలు ఉండ‌కూడ‌ద‌న్నారు. నిర్మాణాత్మ‌క‌మైన చ‌ర్చ జ‌ర‌గాల‌ని స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు. ట్రంప్ కామెంట్‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని సీపీఐ ఎంపీ డీ రాజా రాజ్య‌స‌భ‌లో నోటీసు ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: