మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండు పార్టీల మధ్య రసవత్తర ఘట్టానికి తెరలేపింది. 45 సంవత్సరాలకు పెన్షన్ గురించి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రశ్నించగా దానికి వైసీపీ తరపున మంత్రులు సమాధానమిచ్చారు. అయినా తమకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వడంలేదని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చే క్రమంలో స్పీకర్ టీడీపీ సభ్యులు బుచ్చయ్య చౌదరి,నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడుపై స్పీకర్‌ సస్పెషన్‌ వేటు వేశారు.

ఎన్నికల సమయంలో తాను మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శింస్తుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభకు అంతరాయం కలిగిస్తున్నారని ఆగ్రహించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. ఈ సమావేశాలు ముగిసేవరకు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్‌ దీనిని ఆమోదించారు. అయినప్పటీ ఆ ముగ్గురు సభ్యులు సభలోనే ఉంటూ నినాదాలు చేయడంతో  మార్షల్స్‌ వచ్చి వారిని తీసుకెళ్లారు.

అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముగ్గురు సభ్యుల సస్పెన్షన్, గతంలో సీఎం జగన్ 45 సంవత్సరాలకు పెన్షన్ గురించి మాట్లాడగా స్పీకర్ దానిని తోసిపుచ్చారు. అయినా మరళ మంత్రి బుగ్గన చంద్రబాబును కించపరిచేవిధంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం చెప్పినది చేస్తుందని, తాము ప్రకటించిన మెనిఫెస్టో వలనే తాము ఇప్పుడు ఇక్కడ ఉన్నామని తెలిపారు. అనంతరం జగన్ కూడా చంద్రబాబుకు మైక్ ఇవ్వడం ఎందుకని, ఇక సభను ముందుకు నడిపించాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు మేలు చేకూర్చే చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుండటంతో తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఆక్రోశంతో, ఈర్ష్యతో చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు చూపిస్తున్న పేపర్‌ కటింగ్‌ను స్వయంగా పరిశీలించి.. దానిపై సభా నాయకుడు వివరణ ఇచ్చారు. రెండు నెలలపాటు జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ వివరంగా చేర్చిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్రంలోనే మొదటిసారిగా నామినేషన్‌ పనుల్లో, నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పునరుద్ఘాటించారు. అందులోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ.. 50శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఉండేలా నిర్ణయం తీసుకున్నామని, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: