ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట శాసన సభ సమావేశాల్లో మంగళవారం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలు, మహిళలకు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా మేలు చేస్తూ రూపొందించిన కీలకమైన బిల్లులు అసెంబ్లీ ఆమోదంతో చట్టరూపం దాల్చడంతో సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి మహిళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలోపేతం అయ్యేదిశగా వైఎస్‌ జగన్‌ నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన నిర్ణయాల పట్ల మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కొనియాడారు. పాదయాత్రలో ప్రతి ఆడబిడ్డ కష్టాన్ని తెలుసుకొని.. మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రతి పేద తల్లికీ ఒక సోదరుడిలా అండగా ఉంటూ అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చారని, అదేవిధంగా గ్రామ వాలంటీర్లలోనూ  మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత కింద రూ. 75వేల రూపాయలు రానున్న నాలుగేళ్లలో అందించనున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ తీకున్న నిర్ణయానికి హ్యాట్సాప్‌ చెప్తున్నానని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెల్లూరు జిల్లాకు తొలిసారి బీసీ వ్యక్తికి మంత్రిపదవి అవకాశం దక్కిందని.. ఈ ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే చెందుతుందని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. వెనుకబడిన వర్గాల వారిని అభివృద్ధి చేసేందుకు.. బీసీ బిల్లును ప్రవేశపెట్టడం శుభపరిణామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి అనిల్‌ సభలో మాట్లాడుతూ.. 50శాతానికి పైగా బీసీ, ఎస్సీలకు అవకాశం కల్పిస్తూ.. దేశంలో తొలిసారి సామాజిక మంత్రిమండలిని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. గత 40 ఏళ్ల నుంచి బీసీలకు ఉద్దరిస్తున్నట్లు గత పాలకులు డప్పుకొట్టారని.. కానీ వారికి ఒరిగింది ఏమీలేదని విమర్శించారు. బీసీలంతా గౌరవంగా బతకాలని, వారి అభివృద్ధికి సీఎం గొప్ప కృషి చేస్తున్నారని అభినందించారు.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్ని రాష్ట్రాలూ మనవైపే చూస్తున్నాయని  వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా కొనియాడారు. నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వం నామినేషన్‌పై చేపట్టే పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే అనుభవం అవసరం లేదని.. మంచి మనసుండాలన్నారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంపై మహిళలమంతా గర్వపడుతున్నామని చెప్పారు. మొదటి శాసనసభ సమావేశాల్లోనే మహిళల కోసం బిల్లులను తీసుకొచ్చి చరిత్ర సృష్టించారన్నారు. గిరిజన మహిళకు ఉపముఖ్యమంత్రి, దళిత మహిళకు హోంమంత్రి పదవులు ఇచ్చిన ఏకైన సీఎంగా జగన్‌ రికార్డులెక్కుతారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: