కమలనాధులకు కేంద్రంలో రెండవమారు అధికారంలోకి వచ్చాక కాళ్ళూ, చేతులు సరిగ్గా  ఆడడంలేదు. మరో వైపు అధికార దాహం కూడా తీరడంలేదు కొన్ని తప్పులు చేసినా సరైన ప్రత్యామ్నాయం   లేకపోబట్టి మీకే మళ్ళీ  ఓటు చేస్తున్నాం, జాగ్రత్తగా పాలించండి అంటూ ప్రజలు అధికారం కట్టబెడితే బీజేపీ పెద్దలకు అదే శాశ్వతం అనిపిస్తోందేమో.


కర్నాటకలో సంకీర్ణాన్ని కూలదోసి ఎలాగోలా గద్దెనెక్కాలని చూస్తున్న బీజేపీ దాహం అంతటితో ఆగడంలేదు. ఏపీ, తెలంగాణా, వీలుంటే తమిళనాడు, కేరళా  ఇలా అన్ని చోట్లా జెండా పాతేస్తే ఓ పని అయిపోతుందన్న తొందర ఎక్కువైనట్లుగా ఉంది. లేకపోతే పూటకో నేత, గంటకో మాట తరహాల్లో కమలనాధుల కామెడీ ఏపీలో సాగుతోంది.


తాజా ఎన్నికల్లో వైసీపీకి ఏపీలో వచ్చిన ఓట్లలో ఇరవై శాతం బిజెపివారివేనని బిజెపి ఏపీ  ఇన్ చార్జీ సునీల్ ధియోదర్ అంటున్నారు. నమ్మాలేమో. నిజానికి బీజేపీ ఓటు బ్యాంక్ అసలు ఎంత. వాజ్ పేయ్ వూపులోనే ఆ పార్టీకి ఉమ్మడి ఏపీలో 18 శాతం ఓట్లు దాటలేదు. ఇక మోడీ హవా బలంగా వీచిన 2014 ఎన్నికల్లో కూడా ఏపీలో డబుల్ డిజిట్ ఓట్ల శాతం రాలేదు.


ప్రత్యేక హోదా మంటకలిపి, వెనకబడిన జిల్లాలకు నిధులని, ప్యాకేజికి ఇవ్వకుండా తొక్కిపెట్టి, అమరావతి రాజధాని, పోలవరం వంటి వాటిని వీలైనంత వరకూ పక్కనపెట్టిన బీజేపీకి ఏం చూసి ప్రజలు 20 శాతం ఓటు బ్యాంక్ ఇచ్చారనుకోవాలి. అసలు బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన సంగతి గుర్తు ఉంటే ఇన్ని ఆర్భాటం మాటలు మాట్లాడదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: